Sanju Samson: సఫారీల గడ్డపై టీమిండియా యంగ్ టీమ్ అదరగొట్టింది. శాంసన్ విధ్వంసానికి వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ మాయాజాలం తోడవడంతో తొలి టీ20లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. బ్యాటింగ్ లో సంజు శాంసన్ 107 పరుగులతో సెంచరీతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సఫారీలు.. స్పినర్ల వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలొ 3 వికెట్లు తీయడంతో 17.5 ఓవర్లలో 141 పరుగులకే పరిమితమై 61 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో టీమిండియా సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Sanju Samson: ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో సెంచరీ చేసిన శాంసన్ దక్షిణాఫ్రికాపై మరోమారు అలాంటి ప్రదర్శనే చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజు నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను మొదలెట్టాడు. కేశవ్ మహరాజ్ వేసిన మూడో ఓవర్‌లో జూలు విదిల్చిన శాంసన్ వరుసగా ఫోర్, సిక్స్ బాది ఒక్కసారిగా ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. నాలుగో ఓవర్లో తొలి బంతికే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 7 పరగులకే ఔటైనప్పటికీ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. దీంతో భారత్ ఐదు ఓవర్లకు 49 పరుగులతో నిలిచింది. 8 ఓవర్లో పీటర్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లతో హాఫ్ సెంచరీ చేసిన సంజు.. ఆ తర్వాత సైతం అదే ఊపును కొనసాగించాడు. 9వ ఓవర్లో పాట్రిక్ బౌలింగ్‌లో కెప్న్ సూర్య 21 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్ 2 వికెట్ల నష్టానికి 99 పరుగులతో నిలిచింది.
ఇది కూడా చదవండి: Olympics 2036: ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ బిడ్.. అహ్మదాబాద్ లో ఏర్పాట్లు షురూ
Sanju Samson: జోరుమీదన్న శాంసన్ కు అగ్నికి వాయువు తోడైనట్లు మరోవైపు తిలక్ వర్మ కూడా బ్యాట్ ఝళిపించడంతో 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 162 తో నిలిచింది. దీంతో స్కోరు 250కి చేరువగా వెళ్లేలా కనిపించింది. కానీ ముగింపు మాత్రం అనుకున్నట్లుగా రాలేదు. సంజు, తిలక్‌ల జోరు చూస్తే.. భారత్ చాలా పెద్ద స్కోరే చేసేలా కనిపించింది. బౌండరీ చిన్నదిగా ఉన్న మైదానంలో తేలికగా 220 అన్నా దాటుతుందనిపించింది. కానీ ఆఖర్లో అనూహ్యంగా తడబడి అనుకున్న దాని కన్నా తక్కువ స్కోరుతో టీమిండియా సరిపెట్టుకుంది. 15వ ఓవర్లో సంజు శతకం పూర్తి చేసుకోగా.. తిలక్ వర్మ 33 పరుగులకు ఔటయ్యాడు. తర్వాతి ఓవర్లో ఓ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బౌండరీ వద్ద స్టబ్స్ అందుకున్న చక్కని క్యాచ్‌కు శాంసన్ కూడా వెనుదిరగడంతో భారత్‌కు పెద్ద దెబ్బ తగిలినట్లయింది. దీంతో ఇన్నింగ్స్ ఊపును కోల్పోయింది. శాంసన్ నిష్క్రమణతో పరుగుల ప్రవాహానికి దక్షిణాఫ్రికా అడ్డుకట్ట వేయగలిగింది. యాన్సెన్, కొయెట్జీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. హార్దిక్ 2, రింకు సింగ్ 11, అక్షర్ 7 పరుగులతో బ్యాట్ ఝళిపించడంలో విఫలమయ్యారు. మొత్తంగా ఆఖరి ఆరు ఓవర్లలో భారత్ 6 వికెట్లు కోల్పోయి కేవలం 40 పరుగులు మాత్రమే చేయగలిగింది.దీంతో నిర్ణీత ఓవర్లలో 202 పరుగులు చేసింది.
Sanju Samson: ఛేదనలో తొలి ఓవర్లోనే మార్‌క్రమ్ 8 పరుగుల వద్ద ఔట్ చేయడం ద్వారా అర్ష్‌దీప్ భారత్‌కు శుభారంభాన్నివ్వగా.. 11 పరుగులు చేసిన స్టబ్స్‌ను అవేష్ త్వరగా వెనక్కి పంపాడు. ఆరో ఓవర్లో ఓపెనర్ 21 పరుగులకే విధ్వంవసక ఓపెనర్ రికెల్టన్ ను వరుణ్ ఔట్ చేయడంతో దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 48 పరుగులతో కష్టాల్లో పడింది. ఆ దశలో క్లాసెన్‌కు మిల్లర్ తోడవడంతో దక్షిణాఫ్రికా గాడినపడింది. 11.2 ఓవర్లలో స్కోరు 3 వికెట్ల నష్టానికి 86. సాధించాల్సిన రన్‌రేట్ పెరిగినా.. ప్రమాదకర బ్యాటర్లు క్రీజులో ఉండడంతో దక్షిణాఫ్రికా (SA బలంగానే పోటీలో ఉంది. కానీ క్లాసెన్, మిల్లర్‌లను ఇద్దరినీ ఒకే ఓవర్లో ఔట్ చేయడం ద్వారా వరుణ్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ ఇద్దరి నిష్క్రమణ తర్వాత దక్షిణాఫ్రికా కోలుకోలేకపోయింది. విజృంభించిన బిష్ణోయ్ ఒకే ఓవర్లోక్రుగర్, సైమ్‌లేన్‌ను ఔట్ చేశాడు. అతడు తన తర్వాతి ఓవర్లోనే యాన్సెన్ కూడా వెనక్కి పంపడంతో 8 వికెట్ల నష్టానికి 114తో దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమైపోయింది. కొయెట్జీ ఆఖర్లో వేగంగా 23 పరుగులు సాధించినా ఓటమి అంతరం కాస్త తగ్గింది. సూర్యకుమార్ సూపర్ త్రో విసరడంతో కొయెట్జీ రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత సఫారీలు ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ జట్టులో స్టార్ ఆటగాడు క్లాసెన్ 25 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, రవి బిష్ణోయ్ 3, అవేశ్ ఖాన్ 2, అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ పడగొట్టారు. రెండో టీ20 గబెరా వేదికగా ఆదివారం జరగనుంది.

