Telangana

Telangana: తెలంగాణ పల్లెలకు గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు!

Telangana: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక నిధులను విడుదల చేస్తూ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు దేశంలోని ఆరు రాష్ట్రాలకు నిధులను కేటాయించగా, అందులో మన తెలంగాణ కూడా ఉంది. ఈ నిధుల విడుదలతో రాష్ట్రంలోని దాదాపు 12,600 గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమం అయింది.

కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.1500 కోట్లకు పైగా గ్రాంట్లను విడుదల చేయగా, అందులో తెలంగాణ పంచాయతీ రాజ్ సంస్థలకు రూ.247.94 కోట్ల అన్‌టైడ్ గ్రాంట్స్ దక్కాయి. ఈ నిధులను ముఖ్యంగా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మురుగు కాల్వల మరమ్మత్తులు, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, మరియు శ్మశాన వాటికల అభివృద్ధి వంటి పనుల కోసం ఖర్చు చేయనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇది మొదటి విడత నిధులు కావడం విశేషం.

అయితే, ఈ నిధుల వినియోగంపై కేంద్రం కొన్ని కఠినమైన నిబంధనలను విధించింది. ఈ గ్రాంట్లను కేవలం అభివృద్ధి పనులకు మాత్రమే వాడాలి తప్ప, పంచాయతీ సిబ్బంది జీతాలు లేదా ఆఫీసు ఖర్చుల కోసం ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఏ పని చేయాలన్నా సరే గ్రామ సభ ఆమోదం తప్పనిసరి అని పేర్కొంది. ఈ నిధులు నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లోనే జమ కానున్నాయి, దీనివల్ల మధ్యలో నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు.

పారదర్శకత కోసం కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఖర్చు చేసే ప్రతి రూపాయిని ఆడిట్ చేయాలని, అలాగే ఆన్‌లైన్‌లో అభివృద్ధి పనుల వివరాలను నమోదు చేయాలని సూచించింది. తెలంగాణలో ఇటీవలె పంచాయతీ ఎన్నికలు ముగిసి, కొత్తగా సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఈ నిధులు రావడం గమనార్హం. గత రెండేళ్లుగా సాగుతున్న ప్రత్యేక అధికారుల పాలన ముగిసి, ఇప్పుడు సర్పంచ్‌ల చేతికి నిధులు అందనుండటంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *