Vande Mataram

Vande Mataram: వందేమాతరంపై కేంద్రం కీలక నిర్ణయం.. పాటించకపోతే జైల్లో చిప్పకూడే

Vande Mataram: జాతీయ గేయం ‘వందేమాతరం’ విషయంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, విద్యాసంస్థల్లో ‘జనగణమన’ గీతం పడడానికి ముందే ‘వందేమాతరం’ పాడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ముఖ్యంగా దశాబ్దాల క్రితం తొలగించిన నాలుగు చరణాలను తిరిగి చేర్చుతూ, మొత్తం ఆరు చరణాలను పడాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు ఈరోజు (బుధవారం) ఉదయం నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది.

కొత్త నిబంధనలు ఏమిటి?

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై పౌర పురస్కారాల ప్రదానోత్సవాలు (పద్మ అవార్డులు వంటివి), రాష్ట్రపతి హాజరయ్యే అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతానికి ప్రాధాన్యత ఇస్తూనే, వందేమాతరానికి సరైన స్థానం కల్పించారు.

  • నిలబడటం తప్పనిసరి: పాఠశాలలు లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో వందేమాతరం పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ గౌరవ సూచకంగా నిలబడాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
  • సినిమా హాళ్లలో: థియేటర్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా ఈ గీతాన్ని ప్లే చేయవచ్చు. అయితే, ఇక్కడ ప్రజలు నిలబడటం అనేది వారికే వదిలేస్తున్నారు (తప్పనిసరి కాదు) అని స్పష్టం చేశారు.
  • క్రమం: ఏదైనా కార్యక్రమం ప్రారంభంలో లేదా ముగింపులో జాతీయ గీతానికి ముందే వందేమాతరం ప్లే చేయాల్సి ఉంటుంది.

చారిత్రక నేపథ్యం మరియు వివాదం

వందేమాతరం గీతంపై గత కొంతకాలంగా రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తోంది. 1937లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గేయంలోని కొన్ని చరణాలను తొలగించిందని, ఇది దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కించపరచడమేనని బీజేపీ విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా మొదటి రెండు చరణాలు మాత్రమే అధికారికంగా ఉండగా, మిగిలిన నాలుగు చరణాలను ఇప్పుడు తిరిగి చేర్చారు. బంకిం చంద్ర ఛటర్జీ రాసిన పూర్తి కావ్యాన్ని ఆవిష్కరించడం ద్వారా దేశభక్తిని మరింత పెంపొందించాలన్నది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది.

ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు

జాతీయ చిహ్నాలు, గీతాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత. జాతీయ గీతానికి లేదా గేయానికి అంతరాయం కలిగించినా, ఇతరులు గౌరవించకుండా అడ్డుకున్నా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అపరాధ రుసుముతో పాటు గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *