Delhi: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (Skill University)కి కేంద్రం నుంచి నిధులు రావని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి స్పష్టం చేశారు. ఇవాళ లోక్‌సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ₹100 కోట్లు కేటాయించగా, కార్పస్ ఫండ్‌ను ₹300 – ₹500 కోట్లు స్థాయిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ యూనివర్సిటీ మరింత బలంగా ముందుకు సాగేందుకు, 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యానికి తోడ్పడేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా నిధులు రావచ్చా? అనే ప్రశ్నను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేవనెత్తారు.
దీనికి కేంద్ర మంత్రి జయంత్ చౌదరి స్పందిస్తూ, స్కిల్ యూనివర్సిటీకి నేరుగా నిధులు అందించే ఏ కేంద్ర పథకం లేదని స్పష్టంగా తెలిపారు. అయితే, ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా నైపుణ్యాభివృద్ధి సంస్థలకు మద్దతు అందించగలమని వెల్లడించారు.
కేంద్రం నుంచి నిధుల లభ్యత లేదని తేల్చిచెప్పడంతో, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పూర్తిగా రాష్ట్ర నిధులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.