Census-2027: 2027 సంవత్సరంలో దేశవ్యాప్తంగా నిర్వహించే 16వ జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6,000 కోట్లను కేటాయించింది. ఆదివారం (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో ఈ నిధులను కేటాయించారు. గతేడాది రివైజ్డ్ అంచనాల్లో రూ.1040 కోట్ల కేటాయించగా, ఈసారి దానికి ఆరింతలు పెంచడం విశేషం. కొవిడ్ మహమ్మారి కారణంగా 2021లో చేపట్టాల్సిన ఈ జనగణనను 2027 సంవత్సరంలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
Census-2027: 2027 ఫిబ్రవరి నుంచి చేపట్టాల్సిన 16వ జనగణన కోసం దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు, దాదాపు 1.3 లక్షల మంది సిబ్బంది పాల్గొననున్నారు. వీరంతా డిజిటల్ పరికరాల సహాయంతో ప్రతి కుటుంబ డేటాను సేకరించనున్నారు. ఈ సారి జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జనగణన రెండు దశల్లో జరగనున్నది. మొదటి దశలో ఇండ్ల వివరాలు సేకరిస్తారు. ఈ దశలో ప్రతి ఇంటి ఆస్తులు, పరిస్థితులు, ఇతర సదుపాయాలను సేకరిస్తారు. రెండో దశలో జనాభాను లెక్కిస్తారు. ఇంటిలో నివాసం ఉండే ప్రతి వ్యక్తి యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వివరాలను సేకరిస్తారు.
