Anil Ambani: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకు ఊహించని షాక్ తగిలింది. శనివారం ఉదయం ఆయన ముంబై నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో సీ విండ్, కఫే పరేడ్‌లోని అంబానీ నివాసానికి ఏడుగురు–ఎనిమిది మంది అధికారులు చేరుకుని తనిఖీలు చేపట్టారు. సోదాల సమయంలో అంబానీ కుటుంబం ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.
రూ.3,073 కోట్ల బ్యాంకు మోసం కేసు నేపథ్యం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిర్యాదు మేరకు, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (RCOM) ద్వారా రూ.3,073 కోట్ల విలువైన మోసం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ ఢిల్లీలో కొత్తగా FIR నమోదు చేసింది.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2020లోనే SBI ఈ ఖాతాను “మోసం”గా వర్గీకరించింది. 2021 జనవరి 5న సీబీఐకి ఫిర్యాదు చేసింది. అయితే, జనవరి 6న ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన స్టేటస్ కో ఉత్తర్వుల కారణంగా దర్యాప్తు నిలిచిపోయింది.
ఇది కూడా చదవండి: TVK VS JANASENA: విజయ్‌ది కాన్ఫిడెన్సా..? ఓవర్ కాన్ఫిడెన్సా..?
తర్వాత మార్చి 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మళ్లీ వర్గీకరణ ప్రక్రియ పునఃప్రారంభమైంది. చివరికి 2024 జూలై 15న ఖాతాను అధికారికంగా “మోసం”గా వర్గీకరించగా, 2025 జూన్ 24న RBIకి నివేదించింది. దీని తర్వాతే సీబీఐ FIR నమోదు చేసి, శనివారం సోదాలు ప్రారంభించింది.
మొత్తం మోసం రూ.17,000 కోట్లు?
కేవలం ఈ కేసు మాత్రమే కాకుండా, అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యానికి చెందిన సంస్థలు మరిన్ని బ్యాంకు మోసాల్లో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రెండూ ఆయనపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. మూలాల ప్రకారం, ఈ సంస్థలపై నమోదైన మొత్తం మోసం విలువ రూ.17,000 కోట్లకు పైగా ఉందని అంచనా.
ఈడీ కదలికలు కూడా వేగవంతం
కొద్ది రోజుల క్రితమే ఈడీ అధికారులు అంబానీ వ్యాపార సంస్థలకు చెందిన ఉన్నతాధికారులను విచారణకు పిలిపించారు. ఆ దర్యాప్తు కొనసాగుతుండగానే, ఇప్పుడు సీబీఐ నేరుగా ఆయన నివాసంపై దాడులు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
