Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే 78% పూర్తయింది. ములుగు జిల్లాలో సర్వే 100% పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. జనగాం జిల్లాలో 99.9%, నల్గొండలో 97.7% పూర్తయినట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాల్లో కులగణన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కామరెడ్డిలో 93.3 శాతం, మంచిర్యాల 93.2 శాతం, యాదాద్రి భువనగిరి 92.3 శాతం, నిజామబాద్ 91 శా తం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 90.9 శాతం జగిత్యాల 90.6 శాతం చొప్పున సర్వే పూర్తి చేశారని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో 25,05, 517 నివాసాలు సర్వే చేయల్సి వుండగా, ఇప్పటి వరకు 13,91, 817 నివాసాల్లో (55.6 శాతం) సర్వే పూర్తయినట్టు తెలిపారు.
కాగా, గతంలో మంత్ర పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో 85 వేలకు పైగా ఎన్యుమరేటర్స్ సర్వే చేస్తున్నారని వెల్లడించారు.సర్వే విషయంలో ప్రజలు కూడా సానుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రజల స్థితిగతుల్లో మార్పు తీసుకువచ్చి ఆదర్శవంతమైన పాలన అందించేందుకు సర్వే ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సర్వే దేశానికి దిక్సూచిగా ఉండే విధంగా జరుగుతోందని తెలిపారు. ఎక్కడా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఈ సర్వే వల్ల ఎలాంటి పథకాలు కట్ కావు.. ఇంకా పథకాలు అమలవుతాయి.. దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.. సమాచారం గోప్యంగా ఉంటుందని ప్రభుత్వం పక్షాన ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ అడగడం లేదు.. అకౌంట్ ఉందా? లేదా? అని మాత్రమే తెలుసుకుంటున్నారని అన్నారు. ఆధార్ కార్డు కూడా తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.