Anvesh: యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నటుడు శివాజీ మాట్లాడిన కొన్ని విషయాలపై స్పందించే క్రమంలో, అన్వేష్ దేవీ దేవతలను మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీదేవిల పట్ల ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి.
ఈ వ్యవహారంపై సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అన్వేష్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్లు 352, 79, 299 ఐటీ చట్టం 67 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న అన్వేష్‌కు త్వరలోనే నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్వేష్ వ్యాఖ్యలు సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు, ఖమ్మం జిల్లాలో కూడా అన్వేష్‌పై కేసు నమోదైంది. ఖమ్మం అర్బన్, ఖానాపురంహవేలి పోలీస్ స్టేషన్లలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్వేష్‌ను దేశద్రోహిగా ప్రకటించాలని, అతడిని వెంటనే భారత్‌కు రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర కంటెంట్‌ను ప్రచారం చేయడంపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
