Ambati Rambabu

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

Ambati Rambabu: గుంటూరులో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, వారిని బెదిరించారని ఆరోపిస్తూ పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో ఆయనతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు ఫైల్ చేశారు.

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ బుధవారం అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ప్రదర్శనకు ముందస్తుగా అనుమతులు తీసుకోకపోవడంతో, ర్యాలీని ముందుకు వెళ్లనివ్వకుండా పోలీసులు కంకరగుంట వంతెన వద్ద బారికేడ్లను అడ్డుపెట్టారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు, డీఎస్పీ అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లుతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. లా అండ్ ఆర్డర్‌కు ఆటంకం కలుగుతోందని డీఎస్పీ చెప్పినా వినకుండా, అంబటి అనుచరులతో కలిసి బారికేడ్లను బలవంతంగా నెట్టేందుకు ప్రయత్నించారు. ఈ తోపులాటలో అడ్డుకున్న పోలీసులను నెట్టేయడం, సీఐ వెంకటేశ్వర్లుపై దురుసుగా ప్రవర్తించి ఆయన టోపీని కింద పడేయడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

Also Read: Sabarimala Temple: శబరిమల ఆలయం మూసివేతకు కారణాలు ఏంటి?

పోలీసులు చట్టాన్ని గురించి చెబుతున్నా, ‘మాకు తెలియదు, మేము చిన్న పిల్లలం, మీరు చెప్తే వినడానికి’ అంటూ అంబటి రాంబాబు కవ్వింపు ధోరణిలో మాట్లాడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నిరసనలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం వంటి ఇతర వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.

పలు సెక్షన్ల కింద కేసు నమోదు
అనుమతులు లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పాటు, విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకొని బెదిరించారనే ఆరోపణలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుతో సహా ఇతర నేతలపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని 132, 126(2), 351(3), 189(2) సెక్షన్లు రెడ్ విత్ 190 కింద కేసు నమోదు చేసినట్లు పట్టాభిపురం పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని, ఈ ఘటన గుంటూరులో రాజకీయ ఉద్రిక్తతను పెంచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసుపై అంబటి రాంబాబు నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *