Vijay Devarakonda: టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆదివాసుల ఆగ్రహానికి గురయ్యాయి. ఆయన మాటలు గిరిజనులను అవమానించేవిగా ఉన్నాయని గిరిజన సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “పాకిస్తాన్‌పై మన దేశం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రజలే తమ ప్రభుత్వంపై తిరగబడతారు. కరెంట్, నీళ్లు లేని పరిస్థితుల్లో వాళ్లు 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ వలే బుద్ధి లేకుండా కొట్టుకుంటారు. మనం సమష్టిగా ఉండాలి” అని వ్యాఖ్యానించారు. అయితే ఇందులోని “ట్రైబల్స్ వలే బుద్ధి లేకుండా కొట్టుకుంటారు” అన్న వ్యాఖ్య ఆదివాసులను దూషించినట్లుగా ఉందని సంఘాలు అభిప్రాయపడ్డాయి.
ఈ వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. బాపూనగర్ ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్‌రాజ్ చౌహాన్ సహా అనేక గిరిజన సంఘాలు విజయ్‌పై నిందలు మోపాయి. పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేయగా, హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై దర్యాప్తు కొనసాగుతోంది.

