Teenmaar Mallanna: కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 4న వరంగల్‌లో జరిగిన బీసీ సభలో ఆయన అగ్రవర్ణాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ స్థానిక నేతలు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్లు అల్వాల్ ఇన్‌స్పెక్టర్ రాహుల్‌దేవ్ తెలిపారు.
ఈ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్రమశిక్షణా కమిటీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీ కుల గణన సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
అయితే, ఈ సర్వేలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారంటూ తీన్మార్ మల్లన్న తన సొంత పార్టీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు బీసీ జనాభా తక్కువగా చూపించడంపై ఆక్షేపణలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మల్లన్న చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ టీపీసీసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
