BV Raghavulu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి వేడెక్కింది. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ ఏపీకి ఒక శాశ్వత రాజధాని లేకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం చంద్రబాబు, జగన్ ఇద్దరేనని, ఈ విషయంలో వారిద్దరూ సిగ్గుపడాలని రాఘవులు నిశితంగా విమర్శించారు. ఒకరు రాజధానిని సరిగ్గా నిర్మించలేకపోయారని, మరొకరు మూడు రాజధానుల పేరుతో కాలాన్ని వృధా చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారని, ఈ తరుణంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
ముఖ్యంగా వైఎస్ జగన్‌పై రాఘవులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌కు రాజకీయ పరిణతి (మెచ్యూరిటీ) లేదని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో మూడు రాజధానులంటూ ఊదరగొట్టిన జగన్, ఇప్పుడు ఆ ముచ్చట వదిలేసి అనవసర విషయాలపై మాట్లాడుతున్నారని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు లేదా ప్రతిపక్షంలో ఉన్నవారు ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.
రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడుతున్న సమయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సంతోషించాలని, అభివృద్ధికి అడ్డుపడకూడదని రాఘవులు స్పష్టం చేశారు. కేవలం విమర్శల కోసమే మాట్లాడటం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం బీవీ రాఘవులు చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
