Saudi Arabia: పవిత్ర యాత్రకు వెళ్లిన భారతీయ భక్తులకు సౌదీ అరేబియాలో అత్యంత ఘోర విషాదం ఎదురైంది. ఉమ్రా యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ భయంకర ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 42 మంది సజీవ దహనం అయినట్లు సమాచారం.
ఈ దుర్ఘటనతో భారతీయ ప్రయాణికుల్లో తీవ్ర విషాదం అలుముకుంది. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది.
మక్కా నుంచి మదీనా వెళ్తుండగా..
ఈ ఘోర ప్రమాదం మక్కా నుంచి మదీనాకు భారతీయ యాత్రికులు వెళ్తుండగా చోటుచేసుకుంది. బదర్-మదీనా మధ్యనున్న ముఫ్రిహాత్ ప్రాంతంలో అర్థరాత్రి 1:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి: Congo: కాంగో కాపర్ గనిలో ఘోరం: వంతెన కూలి 32 మంది మృతి!
సమాచారం ప్రకారం, హజ్ యాత్రలో భాగంగా మక్కాలో తమ ఆచారాలను ముగించుకున్న యాత్రికులు మదీనాకు పయనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టగానే చెలరేగిన మంటలు బస్సును క్షణాల్లో చుట్టుముట్టడంతో ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం దక్కలేదు.
మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులు
సమాచారం ప్రకారం, ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో చాలా మంది భారతీయులు ఉన్నారు. వీరిలో.. మహిళలు: 20 మంది చిన్నారులు: 11 మంది. మొత్తం మృతులు: 42 మంది (స్థానిక వర్గాల నివేదిక)
అయితే, 42 మంది మరణించినట్లు స్థానిక వర్గాలు నివేదించినప్పటికీ, ఈ సంఖ్యపై సౌదీ అరేబియా అధికారులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
పవిత్ర యాత్ర కోసం వెళ్లి, రోడ్డు ప్రమాదంలో సజీవదహనమైన ఈ దారుణ ఘటన భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విషాద వాతావరణాన్ని నింపింది. మరణించిన వారి కుటుంబాలకు పూర్తి సమాచారం అందించేందుకు, అవసరమైన సహాయం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
