Afghanistan: అఫ్గానిస్థాన్ (Afghanistan)లో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఇరాన్ (Iran) నుంచి బహిష్కరణకు గురైన వలసదారులను తరలిస్తున్న బస్సు, పశ్చిమ హెరాత్ (Herat) ప్రావిన్స్‌లో బైక్, ట్రక్కులను ఢీకొట్టింది. ఢీకొన్న క్షణాల్లోనే బస్సుకు మంటలు అంటుకోవడంతో 71 మంది అక్కడికక్కడే దగ్ధమై మృతి చెందారు. మృతుల్లో 17 మంది చిన్నారులు ఉండటం మరింత కలచివేసింది.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదంలో బస్సు ప్రయాణికులు మాత్రమే కాకుండా బైక్, ట్రక్కులో ఉన్న వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలిందని అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Ratan Tata Innovation Hub: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఈ ఘటనపై హెరాత్ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి అహ్మదుల్లా ముత్తాకి స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యను ధ్రువీకరించడంతో పాటు, ఘటనా స్థల దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇటీవల కాలంలో అఫ్గానిస్థాన్‌లో జరిగిన అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదాల్లో ఇదొక్కటేనని ఆయన పేర్కొన్నారు. మంటలు చెలరేగిన తర్వాత ప్రయాణికులను రక్షించడం అసాధ్యమైందని విచారం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. ఇరాన్, పాకిస్థాన్ (Pakistan) దేశాలు అఫ్గాన్ శరణార్థులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు 1.5 మిలియన్ల మందికి పైగా అఫ్గాన్లు బలవంతంగా స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. జూన్ నుంచి వలసదారుల రాక మరింతగా పెరిగిందని, కేవలం ఒక నెల వ్యవధిలోనే లక్షలాది మంది తిరిగి అఫ్గానిస్థాన్‌లో అడుగుపెట్టారని వలస వ్యవహారాల శాఖ అధికారులు తెలిపారు.
దీంతో పాటు, శరణార్థుల కష్టాలు, నిరాశ్రయ జీవితం, ఇప్పుడు జరిగిన ఈ బస్సు ప్రమాదం – అన్నీ కలిసి అఫ్గాన్ ప్రజల పరిస్థితిని మరింత దారుణంగా మలుస్తున్నాయి.