టీమిండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్టు ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. బుధవారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించింది. బౌలర్ల జాబితాలో 870 రేటింగ్ పాయింట్లతో బుమ్రా టాప్ ప్లేస్ ను దక్కించుకున్నాడు. దీంతో ఇప్పటివరకు నంబర్‌వన్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ 869 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో బుమ్రా, అశ్విన్ అదరగొట్టారు. చెరో 11 వికెట్లు పడగొట్టిన వీరిద్దరూ… టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే, అశ్విన్ కంటే బుమ్రా తక్కువగా పరుగులు మాత్రమే ఇచ్చాడు. పొదుపుగా బౌలింగ్ చేసి మెరుగైన పాయింట్లు సాధించాడు. దీంతో మూడు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక, వీరిద్దరి తర్వాత ఆస్ట్రేలియా బౌలర్స్ జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడలు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. రవీంద్ర జడేజా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక, బ్యాటింగ్ ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ఆరు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. రిషభ్ పంత్ మూడు స్థానాలు దిగజారి 9వ స్థానానికి చేరుకోగా.. రోహిత్ శర్మ టాప్ 10 నుంచి కిందకు పడిపోయాడు. ఏకంగా ఐదు స్థానాలు దిగజారి 15వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో జో రూట్ అగ్రస్థానంలో ఉండగా, కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.