Budget 2026: దేశ ఆర్థిక దిశను నిర్దేశించే ‘కేంద్ర బడ్జెట్ 2026’ సమర్పణకు ముహూర్తం దాదాపు ఖరారైంది. సాధారణంగా బడ్జెట్ అంటే పనిదినాల్లో(వర్కింగ్ డేస్) ప్రవేశపెట్టడం ఆనవాయితీ, కానీ ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. సెలవు దినం అయినప్పటికీ, అదే రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం భేటీ అయి, ఈ తేదీపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఆదివారం ఎందుకు?
ఫిబ్రవరి 1 ఆదివారంతో పాటు ‘గురు రవిదాస్ జయంతి’ కూడా కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, స్టాక్ మార్కెట్లు మూసి ఉంటాయి. అయినప్పటికీ, ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పార్లమెంటులో చర్చలు పూర్తి చేసి, ప్రతిపాదనలను అమలు చేయాలంటే ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రభుత్వానికి కీలకం. ఒకవేళ ఇదే జరిగితే, సుమారు 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టినట్లవుతుంది. మోదీ ప్రభుత్వ హయాంలో గతంలో శనివారాలు బడ్జెట్ సమర్పించిన దాఖలాలు ఉన్నాయి కానీ, ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కానుంది.
ఇది కూడా చదవండి: Ibomma Ravi: ఐబొమ్మ రవికి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన నాంపల్లి కోర్టు
నిర్మలా సీతారామన్ అరుదైన మైలురాయి
ఈ బడ్జెట్‌తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా, ఆమె మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ (10 సార్లు), మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం (9 సార్లు) సరసన నిలవబోతున్నారు. ఈ విడత బడ్జెట్‌లో ఆర్థిక సంస్కరణలతో పాటు ‘జై భీమ్ – జై భారత్’ (ఒకే దేశం – ఒకే ఎన్నికలు) వంటి కీలక బిల్లులపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉండటంతో ఈ సమావేశాలు రాజకీయంగా కూడా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
బడ్జెట్ షెడ్యూల్ ఇలా..
కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గతంలో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ సమర్పణ తేదీని ఫిబ్రవరి చివరి వారం నుండి ఫిబ్రవరి 1కి మార్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.
దేశ ఆర్థిక భవిష్యత్తును తేల్చే ఈ పద్దులో సామాన్యులకు ఎలాంటి ఊరట లభిస్తుంది? పన్నుల విషయంలో ఎలాంటి మార్పులు ఉంటాయి? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
