Crime News

Crime News: మీర్‌పేటలో విషాదం.. ‘సారీ మై బాయ్’ అంటూ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య!

Crime News: ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం.. మరణానికి ముందు ప్రియుడికి, యువతి రాసిన చివరి లేఖ.. మనం ఒకరినొకరం అర్థం చేసుకున్నామనుకున్నాను.. కానీ అది నిజం కాదు.  మనం ఒకరినొకరం సరిగ్గా అర్ధం చేసుకోలేదు. నీతో కలిసి ఆనందంగా జీవించాలనుకున్నా, కానీ కళ్లముందే భవిష్యత్తు మాయమైపోయింది. ఇదే నా చివరి సమాచారం.. సారీ మై బాయ్.  – అంటూ వాట్సాప్ స్టేటస్‌లో ఆవేదన నిండిన లేఖను పోస్ట్ చేసి ఓ యువతి తనువు చాలించింది. ఈ హృదయవిదారక ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. అల్మాస్‌గూడ ఎస్.ఎస్. రెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్న అశోక్, రూప దంపతుల కుమార్తె నిహారిక (20). ఆమె అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఒక కళాశాలలో బీటెక్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన డెకరేషన్ పనులు చేసే కిషోర్ అనే యువకుడితో గత ఆరు నెలలుగా నిహారిక ప్రేమలో ఉంది.

ఇది కూడా చదవండి: Dragon: ఎన్టీఆర్ తల్లిగా కాజోల్.. స్పందించిన డ్రాగన్ మూవీ టీమ్

అసలేం జరిగింది? ఆదివారం అర్ధరాత్రి వరకు కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూసిన నిహారిక, అనంతరం నిద్రపోవడానికి తన గదిలోకి వెళ్లింది. సోమవారం ఉదయం ఎంతసేపటికీ ఆమె గది నుండి బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెళ్లి చూడగా.. నిహారిక సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

ప్రేమలో విబేధాలే కారణమా? పోలీసుల ప్రాథమిక విచారణలో ఆత్మహత్యకు ముందు నిహారిక తన ఫోన్‌లో పెట్టిన స్టేటస్‌ను గుర్తించారు. నిహారిక తల్లిదండ్రుల వాంగ్మూలం ప్రకారం.. “మేము వారి ప్రేమకు అడ్డు చెప్పలేదు, పెళ్లికి కూడా అంగీకరించాము. కానీ కిషోర్ ప్రవర్తనలో మార్పు రావడంతో నిహారిక అతడిని దూరం పెట్టింది. మాట్లాడటం మానేసింది. దీంతో కిషోర్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తనతోనే మాట్లాడాలని, తననే పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసేవాడు” అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కిషోర్ వేధింపుల వల్లే నిహారిక మనస్తాపానికి గురైందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *