Delhi: కస్టమర్లకు శుభవార్త..దేశవ్యాప్తంగా ఉచిత వైఫై కాలింగ్ సేవలు

Delhi: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ వినియోగదారులకు కొత్త ఏడాది సందర్భంగా శుభవార్త అందించింది. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా వాయిస్ ఓవర్ వైఫై (VoWiFi) సేవలను ప్రారంభించినట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ సేవలు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

మొబైల్ సిగ్నల్ బలహీనంగా ఉండే ఇండోర్ ప్రాంతాలు, బేస్‌మెంట్‌లు, బహుళ అంతస్తుల భవనాల లోపలి భాగాలు, మారుమూల ప్రాంతాల్లో స్పష్టమైన వాయిస్ కాల్స్ అందించడమే ఈ సేవల ప్రధాన లక్ష్యం. వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ లేదా ఇతర ఏదైనా వైఫై నెట్‌వర్క్ ద్వారా తమ ఫోన్‌లోని సాధారణ డయలర్ నుంచే నేరుగా కాల్స్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

దేశవ్యాప్తంగా టెలికాం నెట్‌వర్క్‌ను ఆధునికీకరించే కార్యక్రమంలో భాగంగానే ఈ వైఫై కాలింగ్ సేవలను ప్రవేశపెట్టినట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడంలో ఇది కీలక ముందడుగు అని పేర్కొంది.

ఈ సేవలను వినియోగించాలంటే వైఫై కాలింగ్‌కు మద్దతు ఇచ్చే స్మార్ట్‌ఫోన్ ఉండాలి. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘WiFi Calling’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త సేవతో బీఎస్ఎన్ఎల్ కూడా జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థల సరసన నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *