Tanakallu: శ్రీ సత్యసాయి జిల్లాలోని తనకల్లులో చోటుచేసుకున్న ఒక దారుణ హత్య స్థానికంగా పెను కలకలం సృష్టించింది. ఒక వివాహేతర సంబంధం చివరకు పోలీస్ స్టేషన్ ముంగిటే ప్రాణాలను బలిగొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్పురివాండ్లపల్లికి చెందిన ఈశ్వరప్ప అనే వ్యక్తిని, రాగినేపల్లికి చెందిన హరి, చిన్నప్పలు వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ దారుణం సాక్షాత్తు పోలీసులు చూస్తుండగానే జరగడం గమనార్హం.
ఈ విషాదానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధమని ప్రాథమిక విచారణలో తేలింది. రాగినేపల్లి గ్రామానికి చెందిన హరి భార్యతో ఈశ్వరప్పకు సన్నిహిత సంబంధం ఉందని, ఈ క్రమంలోనే గత నాలుగు రోజుల క్రితం ఆమెను తీసుకుని ఈశ్వరప్ప ఊరు విడిచి వెళ్ళాడని సమాచారం. తన భార్య కనిపించడం లేదని భర్త హరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సాయంతో నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలో ఉన్న ఈశ్వరప్పను, హరి భార్యను పోలీసులు గుర్తించి తనకల్లు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
Also Read: Trump: మోదీకి తెలుసు నేను సంతోషంగా లేనని: ట్రంప్
అయితే, నిందితుడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకువస్తున్నారన్న సమాచారం ముందే తెలుసుకున్న హరి, చిన్నప్పలు పోలీస్ స్టేషన్ బయట కాపు కాశారు. గత రాత్రి పోలీసు జీపు వచ్చి స్టేషన్ ముందు ఆగగానే, ఈశ్వరప్ప కిందకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా వేటకొడవళ్లతో దాడికి తెగబడ్డారు. అత్యంత దారుణంగా ఈశ్వరప్పను నరికి చంపడంతో అక్కడున్న పోలీసులు సైతం ఒక్కసారిగా అసహాయులయ్యారు. ఈ హఠాత్పరిణామంతో ప్రాణభయంతో పోలీసులు కూడా పరుగులు తీయాల్సి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
