Nallakunta: నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న వెంకటేష్ అనే వ్యక్తి, తన ఇద్దరు పిల్లల కళ్లముందే భార్య త్రివేణిని అత్యంత అమానుషంగా హతమార్చాడు. నల్గొండ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ఈ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. మొదట సవ్యంగానే సాగిన వీరి సంసారంలోకి అనుమానంతో గొడవలు మొదలయ్యాయి. వెంకటేష్ వేధింపులు భరించలేక త్రివేణి ఇటీవల పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, తాను మారిపోతానని, ఇకపై గొడవలు పడనని నమ్మబలికిన వెంకటేష్ ఆమెను మళ్లీ హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు.
Also Read: Canada: కెనడాలో దారుణం.. భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు..!
నగరానికి వచ్చిన కొద్ది రోజులకే వెంకటేష్ మళ్లీ పాత పద్ధతిలోనే ప్రవర్తించాడు. అనుమానంతో త్రివేణితో గొడవకు దిగి, ఇంట్లో ఉన్న పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు. అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో తోసేసిన వెంకటేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుల ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తూ త్రివేణి అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించగా, కూతురు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడింది.
ఈ విషాద ఘటనపై సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు వెంటనే రంగంలోకి దిగి. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్ కోసం గాలింపు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేవలం 12 గంటల వ్యవధిలోనే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి మరణించగా, తండ్రి జైలు పాలవడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మంచిగా చూసుకుంటాడని నమ్మి పంపితే తమ కుమార్తెను ప్రాణాలతో లేకుండా చేశాడంటూ త్రివేణి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
