Hyderabad: మేడ్చల్ జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, ఆమె గర్భవతి అని కూడా చూడకుండా దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పలు ప్రాంతాల్లో పడేశాడు. ఈ అమానవీయ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి..
మేడ్చల్ జిల్లా, మేడిపల్లి పరిధిలోని బాలాజీహిల్స్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాకు చెందిన సామల మహేందర్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన స్వాతి (22) ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. గతంలో వీరు బోడుప్పల్‌లో కొన్నాళ్లు నివసించారు. మళ్లీ 25 రోజుల క్రితం తిరిగి అదే ప్రాంతానికి వచ్చి ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. స్వాతి ప్రస్తుతం గర్భవతి కాగా, మహేందర్ రెడ్డి రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
అనుమానంతో దారుణం
తాజాగా, భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలకు కారణం భార్యపై మహేందర్ రెడ్డికి ఉన్న అనుమానమే అని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘర్షణలో మహేందర్ రెడ్డి భార్య స్వాతిని చంపేశాడు. ఆమెను హత్య చేసిన తర్వాత, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్యాక్ చేశాడు. వాటిని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. మహేందర్ రెడ్డి బంధువు ఒకరు ఈ దారుణాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే స్పందించి మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
శరీర భాగాలు కోసం గాలింపు
పోలీసులు నిందితుడిని విచారించగా, ప్రతాపసింగారం దగ్గర మూసీ ప్రాంతంలో మృతదేహాన్ని పడేశానని మహేందర్ రెడ్డి చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. స్వాతి మృతదేహంలోని కేవలం ఛాతీ భాగం మాత్రమే లభ్యమైంది. మిగతా భాగాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణం వెనుక కారణాలు, గత 25 రోజుల్లో ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
Also Read: Suravaram Sudhaker Reddy: గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం భౌతికకాయం
తల్లిదండ్రుల ఆవేదన
తన కూతురును మహేందర్ రెడ్డి మోసం చేసి తీసుకెళ్లిపోయాడని స్వాతి తల్లి కన్నీరు పెట్టుకున్నారు. డిగ్రీ చదువుతున్న తన కూతురిని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు తమ కూతురిని హింసించారని, వారే ఆమెను చంపేశారని ఆరోపించారు. ఈ కేసులో పూర్తి నిజాలు బయటపడాలని, తమకు న్యాయం జరగాలని ఆమె కోరారు.