Palnadu Double Murder

Palnadu Double Murder: పల్నాడు దుర్గి మండలం అడిగొప్పలలో దారుణం.. అన్నదమ్ముల హత్య.!

Palnadu Double Murder: పల్నాడు జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామంలో అన్నదమ్ములైన ఇద్దరు వ్యక్తులపై గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

గ్రామానికి చెందిన కొత్తా హనుమంతు, కొత్తా శ్రీరాంమూర్తి అనే అన్నదమ్ములు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. తమ్ముడు హనుమంతును గ్రామ మధ్యలో బొడ్రాయి సమీపంలో వేటకొడవళ్లతో నరికి చంపగా, అన్న శ్రీరాంమూర్తిని అదే గ్రామంలోని నీలంపాటి అమ్మవారి గుడి వాటర్ ప్లాంట్ దగ్గర దారుణంగా హతమార్చారు. రెండు చోట్ల ఒకే తరహాలో దాడి జరగడంతో ఇది పక్కా పథకం ప్రకారమే జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: Uttam Kumar Reddy: కేసీఆర్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ విధ్వంసం.. తెలంగాణకు తీరని ద్రోహం!

మృతులిద్దరూ టీడీపీ సానుభూతిపరులుగా, స్థానికంగా రాజకీయంగా చురుకుగా ఉన్నవారిగా గుర్తించారు. కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాలే ఈ హత్యలకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైన వారు, దాడికి పాల్పడిన వారు ఒకే సామాజిక వర్గానికి చెందినవారై ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ జంట హత్యలపై పల్నాడు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పందించారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *