Shapur Nagar: హైదరాబాద్ షాపూర్‌నగర్‌లో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన ఆలస్యంగా బహిర్గతమైంది. ఓ ప్రైవేటు పాఠశాలలో నర్సరీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై ఆయా అమానుషంగా వ్యవహరించిన విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాప తండ్రితో వ్యక్తిగత విభేదాలు పెట్టుకున్న ఆయా, ఆ రగడను పాపపై తీర్చుకోవడం అందరినీ కలచివేసింది.
జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం—ఎన్‌ఎల్‌బీనగర్‌లోని పూర్ణిమ పాఠశాలలో లక్ష్మి అనే మహిళ గత ఆరేళ్లుగా ఆయాగా పనిచేస్తోంది. ఇదే స్కూల్‌లో కాపలాదారులుగా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన కలియో–సంతోషి దంపతుల నాలుగేళ్ల పాప అక్కడ నర్సరీలో చదువుతోంది. ఇటీవల ఆయా లక్ష్మికి పాప తండ్రితో జరిగిన వాగ్వాదాన్ని ఆమె మనసులో పెట్టుకుంది. ఆ ఆవేశంతో శనివారం ఉదయం చిన్నారిని స్కూల్ ప్రాంగణానికి తీసుకెళ్లి క్రూరంగా కొట్టడం ప్రారంభించింది. పాప కాళ్లపై నిలబడి దాడి చేయడం వంటి దారుణ హింసించింది.
Also Read: Suicide Mystery: ఒక్క సూసైడ్.. రెండు కోణాలు.. తండ్రి తప్ప.. భర్త తప్ప
ఈ ఘోర దృశ్యాలను స్కూల్‌కు ఎదురుగా ఉన్న భవనం పై అంతస్తులో నిల్చున్న ఓ యువకుడు వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఘటన పోలీసుల దృష్టికి చేరింది. వెంటనే పోలీసులు చిన్నారి కుటుంబాన్ని సంప్రదించి, ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలానగర్ ఏసీపీ నరేశ్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ మల్లేశ్ ఆసుపత్రికి వెళ్లి పాప ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పాప తీవ్ర భయాందోళనకు గురయ్యాయి, జ్వరం రావడంతో రామ్ హాస్పిటల్‌లో చికిత్స అందుతోంది.
వీడియో ఆధారంగా పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయా లక్ష్మిని అరెస్టు చేశారు. చిన్నారి భద్రతపై బాధ్యత వహించాల్సిన స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ప్రదర్శించిందని గుర్తించి వారిపై కూడా కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన పూర్ణిమ స్కూల్‌ను విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు సీజ్ చేసినట్లు ఎంఈఓ తెలిపారు. అభం శుభం తెలియని చిన్నారిపై జరిగిన ఈ దారుణ హింస ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటోంది. ఈ ఘటన చిన్నారుల భద్రతపై పాఠశాలల్లో ఉన్న నిర్లక్ష్యాన్ని మరోసారి బయటపెట్టింది.

