BRS:మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలనకు గురువారం (ఫిబ్రవరి 27) బయలుదేరి వెళ్లింది. ఆయన వెంట ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తాము బయలుదేరి వెళ్తున్నట్టు హరీశ్‌రావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
BRS:ఎస్ఎల్‌బీసీ సొరంగం కూలడంతో 8 మంది కార్మికులు చిక్కుక్కున్నారు. దీంతో గత నాలుగు రోజులుగా ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నది. ఇప్పటికీ వారి జాడ దొరకలేదు. భారీ యంత్ర సామగ్రి, బురద, నీరు చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నది. చిక్కుకున్నవారిలో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఈ దశలో తాము వెళ్లే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే వెళ్లలేదని హరీశ్‌రావు తెలిపారు.
BRS:తమ పర్యటనకు రాజకీయ ఉద్దేశం లేదని, అక్కడ స్వయంగా పరిశీలించి, సహాయక చర్యలు, ఇతర పనుల రీత్యా బీఆర్ఎస్ తరఫున నిర్మాణాత్మకంగా తగు సలహాలు, సూచనలు చేయనున్నామని హరీశ్‌రావు తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా బయటకు రావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఎస్ఎల్‌బీసీ ప్రమాద ఘటన జరిగిన ఇన్నిరోజులు అవుతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని హరీశ్‌రావు విమర్శించారు. బాధితులను వేగవంతంగా బయటకు తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాజకీయాలు చేయకుండా వారి ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తుంటే, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టన్నెల్ వద్ద కూర్చొని బీఆర్ఎస్ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కూర్చొని తమ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి ఇది సమయమా అని హరీశ్‌రావు హితవు పలికారు. పకడ్బందీ చర్యలతో బాధితులను రక్షించే చర్యలు చేపట్టాలని కోరారు.