KTR: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా దిందాలో పోడు భూముల పట్టాల కోసం పోరాడుతున్న రైతులను పోలీసులు అరెస్టు చేయడం, వారిని మద్దతు ఇస్తున్న బీఆర్ఎస్ నేతలపై కూడా చర్యలు తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత రేపింది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
కేటీఆర్ మాట్లాడుతూ – “రైతుల చేతులకు సంకెళ్లు వేసి, వారి హక్కుల కోసం పోరాడుతున్న నేతలను అక్రమంగా నిర్బంధించడం రేవంత్ ప్రభుత్వ గుండాగిరికి నిదర్శనం” అని మండిపడ్డారు. పోడు రైతుల సమస్యలను పరిష్కరించడం బదులు, వారిని అణగదొక్కే కుట్రపూరిత చర్యలు చేయడం ప్రజాస్వామ్యానికి అవమానమని విమర్శించారు.
ఇది కూడా చదవండి: AP News: పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఎక్కడెక్కడ అంటే..?
దిందా రైతులను తరలిస్తున్న సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు కాగజ్‌నగర్ నుండి సిర్పూర్‌టీ, అనంతరం కౌటాలకు తరలించారు. ఈ మార్గమధ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసు వాహనాలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
కేటీఆర్ డిమాండ్ చేస్తూ – “పోడు రైతులను వెంటనే వేధింపులు ఆపి, వారికి భూముల పట్టాలు ఇవ్వాలి. అక్రమంగా నిర్బంధంలో ఉన్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌తో పాటు అన్ని బీఆర్ఎస్ నేతలను తక్షణమే విడుదల చేయాలి” అని హెచ్చరించారు.
అలాగే, ప్రజల పక్షాన నిలిచిన వారిని లక్ష్యంగా చేసుకోవడం వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే ప్రజా వ్యతిరేక పాలనకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని అన్నారు.