Vice President Election 2025: రేపు (సెప్టెంబర్ 9) జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థ వైఖరిని అవలంబించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్డీఏ, ఇండియా కూటములు తెలంగాణకు అన్యాయం చేశాయని ఆరోపిస్తున్న బీఆర్ఎస్, ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా ఎన్నికలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చిందని సమాచారం. ఈ విషయంపై నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్‌కు నలుగురు ఎంపీలు ఉన్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ఆగ్రహం
బీఆర్ఎస్ తాజా నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. “ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరం కావడం అనేది పరోక్షంగా బీజేపీకి మేలు చేసే పని. బీఆర్ఎస్-బీజేపీ మధ్య చీకటి ఒప్పందం మరోసారి బయటపడింది” అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి ఎక్స్ (Twitter)లో విమర్శించారు. “రాజకీయాలు తెలిసిన చిన్నపిల్లవాడికీ కూడా ఈ డ్రామా అర్థమవుతుంది” అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఇండియా కూటమి అభ్యర్థి తెలంగాణ వాది
ఇక ఇండియా కూటమి తరఫున ఈ సారి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. తెలంగాణలో తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేని సుదర్శన్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే పోరాడిన తటస్థ నాయకుడిగా గుర్తింపు పొందారు.
ఇది కూడా చదవండి: Ukraine War: యుద్ధం పై చర్చ.. అమెరికా వెళ్లనున్న యూరోపియన్ నేతలు
రాజకీయ సమీకరణాలు మారిన బీఆర్ఎస్
2022లో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు బీఆర్ఎస్ ఓటు వేసింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. ఈ పరిణామాల వల్ల బీఆర్ఎస్ తన వైఖరిని మార్చుకుని తటస్థంగా ఉండటమే మంచిదని నిర్ణయించినట్లు సమాచారం.
బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు
ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫున రాజ్యసభలో సుదర్శన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి ఉన్నారు. రేపటి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థ వైఖరితో రాజకీయ చర్చలకు కారణమైంది. కాంగ్రెస్ దీనిపై తీవ్ర విమర్శలు చేస్తుంటే, బీజేపీతో బీఆర్ఎస్ స్నేహం బహిర్గతమైందంటూ రాజకీయ వేడి పెరిగింది.

