Mahaa News: మహా న్యూస్ పై BRS రౌడీ ల దాడి ..
మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుమారు 30 మందికి పైగా ఉన్న ఈ గుంపు ఇనుప రాడ్లు, బండరాళ్లతో బీభత్సం సృష్టించారు. పట్టపగలే జరిగిన ఈ దాడిలో, దుండగులు కార్యాలయం ముందు నిలిపి ఉన్న కార్లపై రాళ్లు రువ్వారు. ప్రధాన ద్వారం అద్దాలను పగలగొట్టి, లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. లోపల ఉన్న టీవీని ధ్వంసం చేయడమే కాకుండా, పూల కుండీలను విసిరికొట్టి విధ్వంసం సృష్టించారు.
మహాన్యూస్ సిబ్బందిపై కూడా ఇనుప రాడ్లతో దాడి చేసేందుకు యత్నించారు. అరుపులు, కేకలతో భయానక వాతావరణాన్ని సృష్టించి, కార్యాలయంలోని సిబ్బందిని, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేశారు. వారిపై కూడా దాడికి యత్నించారు.
ఈ ఘటన పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా మీడియా వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. “ఇది కార్యకర్తలా, రౌడీ మూకలా?”, “మీడియాపై గూండాయిజం చేస్తారా?”, “పత్రికా స్వేచ్ఛపై హత్యాయత్నం చేస్తారా?” అంటూ మహా న్యూస్ యాజమాన్యం ప్రశ్నిస్తుంది. మహిళలు అని కూడా చూడకుండా దాడి చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గమైన చర్యకు పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఈ ఘటనపై కేసీఆర్, కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.