BRS vs Speaker: తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలంటూ గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పూర్తి చేయలేదంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపున ఈ పిటిషన్ దాఖలైంది.
గడువు కోరిన స్పీకర్ కార్యాలయం
స్పీకర్ కార్యాలయం ఇప్పటికే ఈ కేసు విషయంలో ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి మరింత గడువు కావాలని కోరుతూ సుప్రీంకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై వచ్చే సోమవారం విచారణ జరగనుంది.
బీఆర్‌ఎస్ తరపు న్యాయవాది ఆరోపణలు
బీఆర్‌ఎస్ పార్టీ న్యాయవాది మోహిత్ రావు తమ కోర్టు ధిక్కార పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ తరపు న్యాయవాది తమ కేసును కోర్టు ముందు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Digital Gold: సెబీ వార్నింగ్.. మీరు డిజిటల్ గోల్డ్ కొంటున్నారా.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి
చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్ న్యాయవాది అభ్యర్థనపై స్పందించిన చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, “నేను ఈ నెల 23వ తేదీన రిటైర్ అవుతాను… ఆ తర్వాత సుప్రీంకోర్టు నవంబర్ 24వ తేదీ నుంచి మూసివేయ్యరు” అని వ్యాఖ్యానించారు. విచారణ ముగిసిన తర్వాత, చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారం చేపడతామని స్పష్టం చేసింది.
శాసనసభలో తమ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం ఆలస్యం అవుతున్నందున, బీఆర్‌ఎస్ పార్టీ ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ద్వారా త్వరగా పరిష్కరించుకోవాలని చూస్తోంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపనుంది.

