KTR: బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ ఐకాస పిలుపునిచ్చిన ఈ నెల 18వ తేదీ బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో సమావేశమైన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు.
పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా సాధించాల్సిన అంశాన్ని రాష్ట్ర శాసనసభలో చర్చించి, ఆ నెపాన్ని ఇతరులపైకి తోసేసే కాంగ్రెస్ ప్రయత్నం కేవలం ‘చిత్తశుద్ధి లేని శివపూజ’ లాంటిదని కేటీఆర్ విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా లేదని, ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారని, వారి చిత్తశుద్ధిని తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. ముఖ్యంగా, బీసీ రిజర్వేషన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులు రావడం అసాధ్యమని ఆయన చెప్పారు. బీసీలకు ఇచ్చిన లక్ష కోట్ల బడ్జెట్, బీసీ సబ్‌ప్లాన్ వంటి హామీల అమలు కోసం కాంగ్రెస్ మెడలు వంచి నిలదీస్తామని కేటీఆర్ ప్రకటించారు.
Also Read: What is this Rajanna: మద్యానికి కాదు, వ్యసనానికి వ్యతిరేకమట!
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన 42 శాతం రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా, విద్య, ఉపాధి, కాంట్రాక్టులు వంటి అన్ని రంగాల్లోనూ బీసీలకు దక్కాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో ఈ వాటా లభిస్తే లక్షల మంది బీసీ బిడ్డలకు మేలు జరుగుతుందని, ఈ మేరకు బీసీ సమాజం డిమాండ్ చేయాలని ఆయన సూచించారు.
బీసీ రిజర్వేషన్ల అంశం త్వరగా తేలాలంటే, పార్లమెంటులో బిల్లు పెట్టడమే ఏకైక మార్గమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (స్వయంగా ఓబీసీ), రాహుల్ గాంధీ ఇద్దరూ కలిసి ఒక్క మాట చెబితే, లేదా ఇండియా, ఎన్డీఏ రెండు కూటములు ఏకమైతే, ఒక్క నిమిషంలో బీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారుతుందని అన్నారు. బీజేపీ నేతలు మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే, తాము కూడా వచ్చి మద్దతు ప్రకటిస్తామని, పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు కచ్చితంగా రిజర్వేషన్లకు అనుకూలంగా ఓటు వేస్తారని కేటీఆర్ హామీ ఇచ్చారు.
దేశ స్థాయిలో బీసీల హక్కుల కోసం పోరాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు. 2004లోనే ఆర్ కృష్ణయ్యను తీసుకెళ్లి అప్పటి ప్రధానికి ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు, చట్టసభల్లో రిజర్వేషన్లు వంటి మూడు ముఖ్యమైన విషయాలు చెప్పిన దార్శనికత కేసీఆర్‌ది అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగానే, బీసీ రిజర్వేషన్ల సమస్యను కూడా ఢిల్లీ దాకా తీసుకువెళ్లి సాధించుకుందామని ఆయన బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు.