Viral News: మహాభారతంలో ద్రౌపది కథ అందరికీ తెలిసిందే. ఆమె ఐదుగురు పాండవులను పెళ్లి చేసుకోవడం అప్పటి కాలంలో ఒక సంప్రదాయమే. అలాంటి బహుభర్తృత్వ సంప్రదాయం ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతుండటం ఆశ్చర్యకరం. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లా, షిల్లాయ్ గ్రామంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. హట్టి తెగకు చెందిన ఇద్దరు సోదరులు ఒకే వధువును పెళ్లి చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.
షిల్లాయ్ గ్రామానికి చెందిన ప్రదీప్ నేగి, కపిల్ నేగి అన్నదమ్ములు, కున్‌హత్ గ్రామానికి చెందిన సునీత చౌహాన్ను ఘనంగా వివాహం చేసుకున్నారు. జూలై 12న ప్రారంభమైన ఈ మూడు రోజుల వివాహ వేడుకలో స్థానిక జానపద గీతాలు, నృత్యాలు సందడి చేశాయి. వందలాది మంది ఈ వివాహానికి హాజరయ్యారు. వధువు సునీత చౌహాన్ మాట్లాడుతూ, “ఈ నిర్ణయం నా ఇష్టంతో తీసుకున్నది. ఎటువంటి ఒత్తిడి లేదు. సంప్రదాయం గురించి ముందే తెలుసు. ఈ బంధంపై నాకు నమ్మకం ఉంది” అని చెప్పింది.
ఇది కూడా చదవండి: Amit sha: త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
సంప్రదాయం వెనుక కారణం
హిమాచల్ ప్రదేశ్‌లోని హట్టి పాలియాండ్రీ తెగలో ఇది ఒక పాత సంప్రదాయం. ఆస్తుల పంపకాలు జరగకుండా, కుటుంబం ఒకటిగా ఉండేలా ఈ ఆచారం పాటిస్తారు. కొంతకాలంగా ఈ సంప్రదాయం పాటించడంలేదు. కానీ ఈ వివాహంతో మళ్లీ ఆ ఆచారం చర్చనీయాంశమైంది. అన్నదమ్ముల్లో పెద్ద అన్న జలశక్తి విభాగంలో ఉద్యోగం చేస్తుండగా, తమ్ముడు విదేశాల్లో టూరిజం రంగంలో పనిచేస్తున్నాడు.
ఈ వివాహం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాతకాల సంప్రదాయాలను గుర్తు చేస్తున్న ఈ అరుదైన వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

