Nacharam

Nacharam: ఒక మద్యం గ్లాసు కోసం.. అన్నను హత్య చేసిన తమ్ముడు!

Nacharam: హైదరాబాద్ నగరంలోని నాచారంలో కేవలం ఒక మద్యం గ్లాసు కోసం జరిగిన గొడవ ఘోర విషాదాంతానికి దారితీసింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి తన సొంత అన్ననే  ప్రాణాలు తీసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ అన్నదమ్ముల మధ్య మొదలైన చిన్నపాటి తగాదా చివరకు ఒకరి మరణానికి, మరొకరు జైలు పాలవడానికి కారణమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మూడంతస్తుల భవనంపై అన్నదమ్ములిద్దరూ కలిసి మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం తాగే గ్లాసు విషయంలో ఇద్దరి మధ్య అకస్మాత్తుగా వాగ్వాదం మొదలైంది. గొడవ పెద్దది కావడంతో ఆగ్రహానికి గురైన తమ్ముడు, తన అన్నను భవనం పైనుంచి కిందకు తోసేశాడు. మూడు అంతస్తుల ఎత్తు నుండి కింద పడటంతో అన్నకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఆసుపత్రికి చేరుకునే లోపే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *