Crime News: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్తబగ్గాం గ్రామంలో జరిగిన ఘోర సంఘటన స్థానికులను కలచివేసింది. సొంత అన్ననే కిరాతకంగా హతమార్చిన ఘటనపై గ్రామంలో తీవ్ర చర్చలు నడుస్తున్నాయి.
పసుపురెడ్డి శ్రీను సెప్టిక్ ట్యాంక్ వ్యాపారం చేస్తూ తన కుటుంబంతో ప్రశాంత జీవితం గడుపుతున్నాడు. అయితే అతని తమ్ముడు పసుపురెడ్డి చంటి మాత్రం నేరప్రవర్తనలో మునిగిపోయాడు. గతంలోనూ అతనిపై హత్యా కేసులు నమోదయ్యాయి. చంటి చేసే నేరాలకు అన్న శ్రీను ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడేవాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.
కొన్నేళ్ల క్రితం చంటి తనకు సోదరి వరుస అయిన యువతితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని రూ.3 లక్షల జరిమానా విధించారు. ఈ సంఘటనతో అన్న శ్రీను పై చంటి కక్ష పెంచుకున్నాడు. అప్పటి నుంచి “ఏదో ఒకరోజు అన్నను తొలగించాలి” అనే ఆలోచనతో ఉన్నాడు.
ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా శ్రీను ఇంటి నుంచి బయలుదేరగా, అదే సమయాన్ని సద్వినియోగం చేసుకున్న చంటి తన స్నేహితుడు చాకలి రామచంద్రుడితో కలిసి హత్యకు ప్లాన్ వేశాడు. “మందు పార్టీ” పేరిట అన్నను గ్రామం బయటకు తీసుకెళ్లాడు. అక్కడ శ్రీను తన స్నేహితుడు భాషాను కూడా పిలిచాడు.
ఇది కూడా చదవండి: Uddhav Thackeray: ఆసియా కప్ భారత్–పాక్ మ్యాచ్ చుట్టూ రాజకీయ దుమారం
నలుగురూ కలిసి మద్యం సేవించిన తర్వాత, రెండు బైకులపై బయలుదేరారు. కొంతదూరం వెళ్లగానే చంటి తన బైక్‌ను అన్న బైక్‌కు అడ్డుపెట్టి గొడవకు దిగాడు. వెంటనే తీసుకువచ్చిన కత్తితో శ్రీను పై దాడి చేశాడు. ఒక్కసారి కాదు, దాదాపు 20 సార్లు పొడిచి భయంకరంగా హతమార్చాడు. రామచంద్రుడు కూడా ఈ దాడిలో తోడయ్యాడు.
ఈ దారుణ దృశ్యం చూసిన భాషా భయంతో అక్కడి నుంచి పారిపోయి, శ్రీను భార్య జ్యోతికి విషయం చెప్పాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న జ్యోతి, భర్తను మృతదేహంగా చూసి కన్నీరుమున్నీరయ్యింది. అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఒకరిని ఒకరు ఆదుకోవాల్సిన అన్నదమ్ములే… ఇలాంటి ఘోరానికి పాల్పడటం సమాజాన్ని కుదిపేస్తోంది.