Krishna District: కృష్ణా జిల్లా ఉయ్యూరులో వివాహం జరిగిన ఆరు నెలలకే ఒక నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. శ్రీవిద్య (24) అనే యువతి తన భర్త వేధింపులు తాళలేక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఎంఎస్సీ చదువుకొని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న శ్రీవిద్య, ఉయ్యూరు మండలం కలవపాములలో విలేజ్ సర్వేయర్‌గా పనిచేస్తున్న రాంబాబును ఆరు నెలల క్రితం వివాహం చేసుకుంది.
అయితే, పెళ్లైన నెల రోజుల నుంచే రాంబాబు శ్రీవిద్యను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందరి ముందు హేళన చేయడం, దారుణంగా కొట్టడం, చిత్రహింసలకు గురిచేయడం వంటివి నిత్యకృత్యంగా మారినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాంబాబు వేధింపులు తీవ్రం కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీవిద్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్:
శ్రీవిద్య తన భర్త రాంబాబు వ్యవహార శైలి, తనను హింసించిన తీరుపై ఒక సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ లేఖలో తన భర్తను “కిరాతకుడు” అని పేర్కొంది. “నా భర్త పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నాను.. జుట్టు పట్టుకొని మంచానికి వేసి కొడుతుండడంతో తలంతా నొప్పిగా ఉంది. రేపు రాఖీ పండుగకు ఉండనేమో.. నాన్నంటే నాకు ధైర్యం.. ఈ స్థితికి కారణమైన భర్త, అతని కుటుంబ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదల వద్దు..” అని లేఖలో రాసింది.
Also Read: MP Sudha Ramakrishnan: మార్నింగ్ వాక్ చేస్తుండగా.. ఎంపీకి షాక్: చైన్ స్నాచింగ్!
అంతేకాకుండా, “ఓ అమ్మాయి ముందు నేను పనికిరాను అంటూ రాంబాబు హేళనగా మాట్లాడాడు.. ఆ అమ్మాయి ముందు చేసిన హేళన, జ్ఞాపకాలు మరిచిపోలేకపోతున్నా.. రోజు తాగి నన్ను హింసిస్తున్నాడు.. నా తలను మంచానికి వేసి కొట్టి, వీపుపై పిడిగుద్దులు గుద్దాడు. మంచిగా ఉండటమే నేను చేసిన తప్పా అమ్మా.. నన్ను నాన్నను ప్రతిసారీ తిడుతున్నాడు.. నేను పేపర్ కరెక్షన్స్ చేస్తుంటే తీసుకొని ఎగరవేశాడు.. ఆ పేపర్స్ తీసుకెళ్ళి కాలేజీ వారికి ఇచ్చేయండి.. అరేయ్ తమ్ముడు జాగ్రత్త. ఈ సారి నేను నీకు రాఖీ కట్టలేనేమో.. అమ్మ, నాన్నను జాగ్రత్తగా చూసుకో.. తమ్ముడు..” అంటూ తన చివరి మాటలను సూసైడ్ నోట్‌లో రాసింది.
రాంబాబు సాయి అనే మహిళతో పోల్చుతూ నీచంగా తిట్టేవాడని కూడా సూసైడ్ నోట్‌లో శ్రీవిద్య ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం రాంబాబు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.