Br naidu: వైసీపీ టైంలో టీటీడీలో 250 కోట్ల స్కాం..

Br naidu: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూల్లో ఉపయోగించిన నెయ్యి కల్తీగా ఉందని, అందులో పామ్ ఆయిల్, జంతు కొవ్వు (టాలో) మరియు ఇతర రసాయనాలు కలిపారని ఆయన అన్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి చేసిన కుట్రగా ఆయన వ్యాఖ్యానించారు.

2019 నుంచి 2024 మధ్య కాలంలో టీటీడీకి సరఫరా చేసిన సుమారు 60 లక్షల కిలోల నెయ్యి కల్తీ అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు. ఈ కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారని, దీనివల్ల రూ.250 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు.

ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక సంస్థకు సరైన పాల సేకరణ సామర్థ్యం లేకపోయినా నిబంధనలు మార్చి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆయన విమర్శించారు. నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు ఎన్‌డీడీబీ నివేదికతో పాటు SIT రిపోర్ట్‌లో కూడా ఉందని చెప్పారు. ఇది హిందువులపై దాడి చేసినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కేసులో గత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరియు ఇతర వైసీపీ నేతలపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. వారి బ్యాంక్ ఖాతాల్లోకి కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో విచారణ చేయాలని, గత ప్రభుత్వ ఒత్తిళ్లకు సంబంధించిన ఈ-మెయిల్ ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు.

కల్తీ నెయ్యిలోని రసాయనాలపై పూర్తి నిజాలు బయటపడేందుకు మైక్రో డీఎన్ఏ టెస్ట్ చేయాలని కోర్టును మరియు SIT‌ను కోరతామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ కుంభకోణం బయటపడిందని, తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎలాంటి రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *