Botsa Satyanarayana: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని అరెస్టులు చేస్తున్నారని వైసీపీ సీనియర్ నాయకులు, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత పాలన రాజ్యాంగబద్ధంగా నడుస్తుందా అనే అనుమానం కలుగుతోందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారీతిన పాలిస్తున్నారని విమర్శించారు.
ప్రశ్నిస్తే అరెస్టులా?
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రభుత్వ వైఖరి ఏమిటని ప్రశ్నించినందుకు ఎందుకంత అసహనం అని బొత్స నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా అంటూ మండిపడ్డారు. వెంకటరెడ్డి అనే వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేసి రోజంతా తిప్పి, కోర్టులో హాజరుపరిస్తే, న్యాయమూర్తి చీవాట్లు పెట్టి బెయిల్ ఇచ్చారని పేర్కొన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని, తప్పు చేస్తే శిక్షించాలి కానీ, అక్రమ కేసులు పెట్టి వేధించడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో ఇది తాలిబన్ల పాలన అనుకోవాలా? అని ప్రశ్నించారు.
అధికారుల ఆత్మహత్యకు కారణం ప్రభుత్వమే!
మాజీ AVSO సతీష్ కుమార్ ఆత్మహత్య వెనుక ప్రభుత్వ ఒత్తిడి ఉందని బొత్స సంచలన ఆరోపణ చేశారు. ఇది ప్రభుత్వ హత్యే అని తాను అంటున్నానని, ధైర్యం ఉంటే వచ్చి తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అని ప్రశ్నించిన ఆయన, అన్ని రోజులు ఒకేలా ఉండవని, తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు, ప్రభుత్వం వైఖరిపై విమర్శలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని బొత్స సత్యనారాయణ విమర్శించారు. అంత అసహనం ఎందుకని ఆయనను ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసన మండలిలో తీర్మానం చేయాలని కోరితే, ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదని నిలదీశారు. తమ హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తు చేస్తూ, ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

