Delhi: ఢిల్లీ స్టేడియంకు బాంబ్ బెదిరింపు.. అసలు IPL ఉంటుందా ఉండదా..?

Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి డీడీసీఏ (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్)కు ఒక బెదిరింపు ఈ-మెయిల్ అందింది. దాడులకు స్లీపర్ సెల్స్ సిద్ధంగా ఉన్నాయని, ఇవి దేశవ్యాప్తంగా పాకిస్థాన్‌కు విధేయంగా పనిచేస్తున్నాయని అందులో హెచ్చరించారు.

ఈ స్టేడియం ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హోం గ్రౌండ్‌గా ఉండగా, మే 11న ఢిల్లీ క్యాపిటల్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా, బీసీసీఐ ఇప్పటికే టోర్నమెంట్‌ను వారం పాటు వాయిదా వేసినట్లు ప్రకటించింది.

ఈ మెయిల్‌ వచ్చిన విషయాన్ని డీడీసీఏ అధికారి ధృవీకరించారు. “ఈ ఉదయం మాకు బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం. వారు తక్షణమే స్పందించి స్టేడియంలో తనిఖీలు చేపట్టారు,” అని టൈమ్స్ ఆఫ్ ఇండియా డాట్ కామ్‌కు వెల్లడించారు.

ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ బెదిరింపును తీవ్రమైన విషయంగా తీసుకుని విచారణ మొదలుపెట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదే సమయంలో, ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, అలాగే ధర్మశాలలో మ్యాచ్ సమయంలో ఎయిర్ రెయిడ్ అలర్ట్ మోగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని, జాతీయ భద్రతే ముఖ్యమని భావించిన బీసీసీఐ, ఐపీఎల్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ, “దేశ భద్రత మా ప్రాధాన్యత. భారత సాయుధ బలగాలకు మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము. భద్రతా పరిస్థితులపై సమీక్ష అనంతరం మిగిలిన 16 మ్యాచ్‌ల కోసం సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేస్తాము,” అని తెలిపారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *