Bomb Threat: దేశ రాజధానిలో శుక్రవారం రాత్రి ఆందోళన కలిగించిన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌కి గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పంపడం కలకలం రేపింది. “ఆడిటోరియంలో బాంబు పెట్టాం, భవన్‌ను పేల్చేస్తాం” అంటూ ఘోరమైన హెచ్చరికతో వచ్చిన ఈ మెయిల్ అధికారులు, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసింది.
ఈ ఘటన శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఆ సమయంలో భవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ప్రముఖ సమాజ సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ పూలే జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి వారం కేంద్రంలోని ఉన్నతాధికారుల కోసం సినిమా ప్రదర్శించే ఈ కార్యక్రమం క్రమబద్ధంగా జరుగుతుండగా, ఈసారి మాత్రం ఊహించని విధంగా బెదిరింపు రావడం గమనార్హం.
అప్పుడు రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ముంబైలో ఉండడంతో, ఆయన వెంటనే భవన్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది – తెలుగు రాష్ట్రాల పోలీసులతో పాటు ఢిల్లీ పోలీసులు – సంఘటన స్థలాన్ని జాగిలాల సహాయంతో సుమారు గంటపాటు శోధించి ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని తేల్చారు.
ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్, ఇండియా గేట్ వంటి ముఖ్య ప్రాంతాలకు అతి సమీపంలో ఉన్న ఏపీ, తెలంగాణ భవనాలకు బెదిరింపు మెయిల్ రావడం అధికారులు, ప్రజలను తీవ్రంగా ఆందోళనకు గురి చేసింది.
పోలీసులు ప్రస్తుతం బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ సెల్ సహాయంతో విచారణను ముమ్మరం చేశారు. దేశ రాజధానిలో అత్యంత సురక్షితమైన ప్రాంతాల్లో ఒకటైన ఈ ప్రాంగణంలో ఇలాంటి ఘటనలు జరగడం గంభీరంగా పరిగణించాల్సిన విషయమే.