Bali Sea Tragedy: ఇండోనేషియాలో పర్యాటకుల పర్యటన విషాదంగా మారింది. బాలి ద్వీపానికి సమీపంలో ఒక ఫెర్రీ పడవ బుధవారం రాత్రి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, 38 మంది గల్లంతయ్యారు. మరో 23 మందిని ప్రాణాలతో కాపాడారు.
ఈ ఫెర్రీలో మొత్తం 65 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే 14 ట్రక్కులు సహా మొత్తం 22 వాహనాలు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం ఎలా జరిగిందంటే.. బుధవారం రాత్రి తూర్పు జావాలోని కేతాపాంగ్ ఓడరేవు నుంచి బాలి దిశగా బయలుదేరిన పడవ, సముద్రంలో ప్రయాణం మొదలైన అరగంటలోనే మునిగిపోయింది. ఇది బాలి లోని గిలిమనుక్ ఓడరేవు వైపు 50 కిలోమీటర్ల దూరంలో జరిగింది.
ఇది కూడా చదవండి: Tirupathi Fire Accident: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం..
ప్రమాదం జరిగిన వెంటనే, సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం వరకూ 9 పడవలు, టగ్ బోట్లు, గాలితో నిండిన చిన్న పడవలు సహాయంగా రంగంలోకి దిగాయి. అయితే అల్లకల్లోల సముద్రం, భారీ అలలు (దాదాపు 2 మీటర్లు) రాత్రిపూట సహాయక చర్యలకు అడ్డంకిగా మారాయి.
రక్షణ దళాలు ఇప్పటికీ గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. కొంతమందిని గట్టికి తీసుకొచ్చినప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నారు.
ఇండోనేషియా అనేది సుమారు 17,000 దీవులతో కూడిన దేశం, అందుకే ఇక్కడ పడవ ప్రయాణాలు చాలా సాధారణం. అయితే భద్రతా ప్రమాణాలు సరిగా పాటించకపోవడం వల్ల తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది మార్చిలో కూడా బాలి తీరంలో ఒక పడవ బోల్తా పడిన ఘటన జరిగింది. అందులో ఒక ఆస్ట్రేలియా మహిళ ప్రాణాలు కోల్పోయింది.
ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని, గల్లంతైన వారిని కనిపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Sources: మెట్రో టీవీ, అసోసియేటెడ్ ప్రెస్, ఇండోనేషియా రెస్క్యూ ఏజెన్సీ

