BJP Telangana:తెలంగాణ బీజేపీలో సమన్వయం లేదా? రాష్ట్ర ముఖ్య నేతల్లో సఖ్యత లేదా? ఎవరికి వారే యమునా తీరేనా? ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య అసలు పొసగడం లేదా? ఇప్పటికే సమన్వయలోపంతోనే బీజేపీపై కమిట్‌మెంట్ కలిగిన ఎమ్మెల్యేనే పార్టీకి దూరం చేసుకున్నారా? తాజాగా ఇతర నేతల్లోనూ అదే గూడు కట్టుకొని ఉన్నదా? ఎప్పటికైనా అది బహిర్గతం అవుతుందా? రాష్ట్రంలో ఆ పార్టీ బలహీనతకు, ఎదుగుదలలో లోపానికి అవే కారణమా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
BJP Telangana:తాజాగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అభ్యంతరాలు వాటినే సూచిస్తున్నాయా? అంటే నిజమేనని తెలుస్తున్నది. వారు లేవనెత్తిన అభ్యంతరాలనే గతంలోనూ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్, ఇంకొందరు నేతలు కూడా లేవనెత్తారు. అయినా సమన్వయలోపాన్ని సరిచేసేందుకు ఇటు రాష్ట్ర నాయకత్వం, అటు జాతీయ నాయకత్వం చొరవ తీసుకోలేదు. దీంతోనే మళ్లీ వారిద్దరితో పాటు మరికొందరు తమ గళాన్ని విప్పారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమస్యలను పరిష్కరించకుంటే, స్థానిక ఎన్నికల్లో పార్టీ మునగడం ఖాయమని హెచ్చరించారు.
BJP Telangana:బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి విశ్వేశ్వరరెడ్డి ఇద్దరూ తీవ్రస్థాయిలో చర్చలు లేవనెత్తారు. పార్టీ కార్యాలయంలో కూర్చొని కార్యక్రమాలు నిర్ణయిస్తే క్షేత్రస్థాయిలో పార్టీ ఎదగదని, క్షేత్రస్థాయికి వెళ్లాలని కాటిపల్లి సూచించారు. తరచూ తాము ఆఫీసులకు రావడమే పనా? అసలు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమన్వయం లోపించింది. కనీసం ఎంపీలు, ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడుకుంటున్నారా? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. దీనిని సరిచేయరా? అని ఆయన ప్రశ్నించారు.
BJP Telangana:బీజేపీ బహిరంగ సభల నిర్వహణపైనా కొందరు నేతలు అభ్యంతరాలను వ్యక్తంచేశారు. పార్టీ స్థానిక ఇన్‌చార్జులకు కాకుండా, ఇతర నాయకులకు సభల నిర్వహణ బాధ్యతలు అప్పగించడమేమిటని ప్రశ్నించారు. బీజేపీ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్యక్షుల పనితీరుపై గతంలోనే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర అభ్యంతరాలను వ్యక్తంచేశారు. ఈ సమావేశంలోనూ అదే అంశాన్ని ఆయన మళ్లీ లేవనెత్తారు. దీనిపై స్పందించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆ జిల్లాల అధ్యక్షుల పనితీరుపై విచారించేందుకు కమిటీని వేయనున్నట్టు తెలిపారు.
BJP Telangana:కాటిపల్లి, కొండ, ఇతర నేతలు లేవనెత్తిన అంశాలను సరిచేసుకొని పార్టీ కార్యక్రమాలను విస్తరిస్తూ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆయా పరిస్థితులను బేరీజు వేసుకోకుంటే గత పరిస్థితులే పునరావృతం అవుతాయని హెచ్చరిస్తున్నారు.