BJP Telangana: తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి బట్టబయలైంది. ఇప్పటికే హైదరాబాద్ మహానగర పరిధిలో ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే అయిన రాజాసింగ్‌కు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మధ్య వైరం మరింత ముదిరినట్టయింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తాజాగా నిర్వహించిన కీలక సమావేశానికి రాజాసింగ్ గైర్హాజరు కావడంతో లుకలుకలు ఇంకా సమసిపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
BJP Telangana: గత కొద్దిరోజులుగా బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన అసంతృప్తిని బయట పెట్టుకుంటూనే ఉన్నారు. ఏకంగా ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపైన పరోక్ష వ్యాఖ్యలతో తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. దీన్నిబట్టి కిషన్‌రెడ్డి, రాజాసింగ్ మధ్య గ్యాప్ పెరుగుతున్నదని పార్టీ కూడా భావించింది. పార్టీలో కొన్ని వర్గాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, పాత తరం నేతలను బాధ్యతలను తప్పించాలని ఓ దశలో రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
BJP Telangana: మరో సందర్భంగా.. రాష్ట్ర బీజేపీ బాధ్యతలను కొత్త వారిక అప్పగించాలని, పాత నేతలకు ఇవ్వవద్దని ఏకంగా అధిష్టానానికే సవాల్ విసిరారు. లేకుంటే పార్టీ భవిష్యత్తు కష్టతరం అవుతుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను కూడా కిషన్‌రెడ్డి లాంటి మరికొందరు నేతలకు రాజాసింగ్ బహిరంగంగానే చురకలు అంటించారని గుసగుసలు వినిపించాయి.
BJP Telangana: ఇదే దశలో హైదరాబాద్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ రావడం.. బీజేపీ అభ్యర్థిగా గౌతమ్‌రావును రాష్ట్ర కమిటీ ప్రకటించడంపైనా రాజాసింగ్ ఏకంగా మండిపడ్డారు. బీసీ, ఎస్సీలకు అవకాశం ఇవ్వాలంటూ వచ్చిన ఆయన గౌతమ్‌రావు ఎంపికపై ఫైర్ అయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని తాను అంగీకరించబోనని ప్రకటించారు.
BJP Telangana: ఈ దశలో మరో కేంద్ర మంత్రి బండిసంజయ్ కలుగజేసుకున్నారు. రాజాసింగ్ వద్దకు గౌతమ్‌రావును తీసుకొని వెళ్లి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా రాజాసింగ్, గౌతమ్‌రావులు కరచాలనం చేసుకోవడం, ఒకరినొకరు పూలదండలు వేసుకొని అభినందనలు తెలుపుకోవడం జరిగింది. దీంతో బండి సంజయ్ చొరవ పనిచేసిందని అందరూ భావించారు. ఇంతటితో రాజాసింగ్ అసంతృప్తి సమసిపోయిందని అనుకున్నారు.
BJP Telangana: తాజాగా బేగంపేటలోని హరిత ప్లాజాలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇదే సమావేశానికి ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, నగర కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే హైదరాబాద్‌లో ఒకే ఒక ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ హాజరు కాలేదు. బండిసంజయ్ చొరవతో సయోధ్య కుదిరిందని భావిస్తున్న తరుణంలో మళ్లీ రాజాసింగ్ వైఖరితో అసంతృప్తి జ్వాలలు చల్లారలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ దశలో జరిగే ఎన్నికల్లో ప్రభావం ఎలా ఉంటుందోనని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.