BJP Telangana: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక అంశం ఎన్నాళ్ల నుంచో ఊరిస్తూ వస్తున్నది. పోటీపోటీ నెలకొనడంతో పాటు వరుసగా వివిధ రాష్ట్రాల ఎన్నికలు రావడంతో ఆ పార్టీ అధిష్టానం కూడా ఈ అంశంపై సరైన దృష్టి పెట్టలేకపోయింది. దీంతో ఇప్పటి వరకూ ఈ పదవికి ఎవరినీ నియమించలేదు. పార్టీలోని కీలక నేతలు పోటీ పడుతుండటంతో రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరంగా మారింది.
BJP Telangana: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఎంపీగా గెలవడంతో కేంద్ర మంత్రి పదవి వరించింది. ఇది జరిగి ఇప్పటికీ దాదాపు 9 నెలలు కావస్తున్నది. అప్పటి నుంచి రేపు, మాపు అంటూ అధ్యక్షుడిని ప్రకటిస్తారంటూ ప్రచారం జరుగుతూ వస్తున్నది. ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ నెలాఖరులోగా పార్టీ అధిష్టానం నియమించే అవకాశం ఉన్నదని కిషన్‌రెడ్డి ప్రకటించడంతో మరింత ఉత్కంఠకు దారితీసింది.
తెరమీదికి పలువురు నేతల పేర్లు
BJP Telangana: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు కీలక నేతలు పోటీపడుతున్నారు. దీనికోసం కేంద్ర సహాయ మంత్రి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మల్కాజిగిరి, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ ఎంపీలైన ఈటల రాజేందర్, అర్వింద్, రఘునందన్‌రావు, డీకే అరుణతోపాటు మాజీ ఎమ్మల్సీ ఎన్ రామచంద్రరావు కూడా పోటీ పడుతున్నారు.
BJP Telangana: ఈ దశలో ఎవరికి వారే కేంద్రంలోని కీలక నేతలతో లాబీయింగ్ జరుపుతున్నారు. ఇదే దశలో పాత, కొత్త నేతల అంశం తెరమీదికి వచ్చింది. దీనికి తోడు ఆర్ఎస్ఎస్ నేపథ్యం అన్న అంశాన్ని కూడా తెరమీదికి తెచ్చారు. దీంతో అధ్యక్షపదవికి ఎంపిక విషయంలో అధిష్టానం కూడా తటపటాయిస్తూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంటే ఎవరికివ్వాలి, లేకున్నా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాబాహుల్యం ఉన్న నేతలు ఎవరైతే బాగుంటుంది అన్న విషయాలపై ఇప్పటిదాకా సమాచారం రాబట్టింది.
BJP Telangana: తొలుత ఈటల రాజేందర్ వైపు బీజేపీ అధిష్టానం మొగ్గుచూపినట్టు ప్రచారం జరిగింది. ఈ దశలో ఆ పార్టీ కీలక నేతలు అభ్యంతరాలు తెలిపినట్టు సమాచారం. ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదని, వామపక్ష భావజాలం ఉన్నదంటూ ఫిర్యాదులు చేసినట్టు అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా వారి గురించి వాకబు చేసింది. ఈటలకు ఉన్నంతగా రాష్ట్రవ్యాప్తంగా సంబంధ బాంధవ్యాలు మిగతా వారికి లేకపోవడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.
బీజేపీ అధిష్టానం మదిలో కొత్త ఆలోచన
BJP Telangana: ఈ దశలోనే బీజేపీ అధిష్టానానికి ఒక కొత్త ఆలోచన వచ్చినట్టు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని మహిళకు ఇవ్వలేదు. ఏపీలో ప్రస్తుతం పురందేశ్వరికి ఇచ్చిన మాదిరిగానే తెలంగాణలో కూడా మహిళకు చాన్స్ ఇస్తే ఎలా ఉంటుందన్న విషయాలపై ఆరా తీసిందని సమాచారం. ఈ ఆలోచనతో ఒకవేళ మహిళకు చాన్స్ ఇస్తే మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది.
BJP Telangana: మహిళకు అధ్యక్ష పదవి ఇస్తే కాంగ్రెస్‌లో మాదిరిగా వర్కింగ్ ప్రెసిడెంట్ల పోస్టులను ఏర్పాటు చేసి ఆ పదవిని బీసీకి ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ మహిళ వద్దని అధిష్టానం భావిస్తే ఈటల, రఘునందన్‌రావు, అర్వింద్ పేర్లు పరిశీలనలో ఉంటాయి. ఈ దశలోనే బండి సంజయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నది. తాను రేసులో లేనని ఆయన చెప్పుకుంటున్నా, ఆయనకు మళ్లీ పగ్గాలు ఇస్తే ఎలా ఉంటుందనే అంశంపై క్యాడర్‌ను అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం.