BJP

BJP: బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్ విడుదల!

BJP: భారతీయ జనతా పార్టీ నూతన సారథి ఎంపికకు సంబంధించి అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం ముగియడంతో, ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీ జాతీయ ఎన్నికల అధికారి డాక్టర్ కె. లక్ష్మణ్ శుక్రవారం కీలక వివరాలను వెల్లడించారు. ఈ ప్రక్రియ మొత్తం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగనుంది. జనవరి 20వ తేదీన దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరనేది అధికారికంగా స్పష్టం కానుంది.

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 19వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన చేపడతారు. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే వారు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించారు. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే, జనవరి 20వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు.

Also Read:  Mitchell Starc: యాషెస్ హీరో మిచెల్ స్టార్క్‌కు ఐసీసీ గౌరవం

బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న నితిన్ నబీన్ ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. యువ నాయకత్వానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలు నితిన్ నబీన్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బీహార్‌కు చెందిన నితిన్ నబీన్ గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న ఆయన, పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగి ఇప్పుడు జాతీయ అధ్యక్ష పీఠానికి చేరువయ్యారు.

ఈ ఎన్నికల ప్రక్రియలో మొత్తం 5,708 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నిబంధనల ప్రకారం, అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కనీసం ఐదు రాష్ట్రాల నుంచి ఐదు సెట్ల నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే 30 రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి కావడంతో, జాతీయ అధ్యక్షుడి ఎంపికకు మార్గం సుగమమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *