Jagga Reddy: దేశవ్యాప్తంగా ఎరువుల సరఫరాపై జరుగుతున్న రాజకీయాలపై కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణలోని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్రం సృష్టించిన ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
బీజేపీపై జగ్గారెడ్డి విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే బీజేపీ ఎరువుల సరఫరాను అడ్డుకుంటోందని జగ్గారెడ్డి ఆరోపించారు. ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడేలా చేసి, ఆ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండి ఉంటే దేశంలో ఇలాంటి సమస్య ఎప్పుడూ వచ్చేది కాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను బలి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
“రైతులు బీజేపీ ట్రాప్‌లో పడొద్దు”
జగ్గారెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, “రైతులు ఎవరూ బీజేపీ ట్రాప్‌లో పడొద్దు. వారి రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఎరువుల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది” అని హామీ ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఎరువుల సమస్యలు చాలా వచ్చాయని, అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో గొడవపడి సమస్యను పరిష్కరించిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా రైతుల పక్షాన నిలబడి సమస్యను పరిష్కరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.