Telangana: తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వానకాలం రైతు భరోసా లేనట్టేనని తేలిపోయింది. గత బీఆరెస్ ప్రభుత్వం రైతు బంధు కింద పెట్టుబడికి ఎకరాకు ఏటా రూ.10 వేలను ఇచ్చింది. అయితే గత ఎన్నికలకు ముందు తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఏటా రూ.15,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చన తర్వాత గతేడాది ఆలస్యంగా రైతుబంధును ఇచ్చింది.
Telangana: ఈ వానకాలం రైతు భరోసా ఇస్తుందని రైతులు వేయికళ్లతో ఎదురు చూశారు. గత ప్రభుత్వ హయాంలో గుట్టలు, రోడ్లకు ఇచ్చారని, తాము సక్రమంగా ఇస్తామని, దుర్వినియోగం కాకుండా చూస్తామంటూ ప్రభుత్వం కాలం వెల్లదీస్తూ వచ్చింది. దీని అమలు కోసం కమిటీ వేశారు. వివరాలు సేకరిస్తున్నట్టు జాప్యం చేస్తూ వచ్చారు. తీరా పంటకాలం పూర్తికావస్తున్నా దసరా, దీపావళికి ఇస్తారేమోనని రైతులు ఎదురుచూశారు.
Telangana: తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాటలతో రైతులకు నిరాశే మిగిలింది. రైతు భరోసా కోసం కమిటీ వేశామని, అది నివేదిక ఇస్తే, వచ్చే పంట కాలానికి రూ.7,500 ఇస్తామని సెలవిచ్చారు. దీనిపై తెలంగాణ రైతులు భగ్గుమంటున్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందని ఆశపడితే నీరుగారుస్తారా అంటూ మండిపడుతున్నారు.