Bird Flu: బాన్సువాడ నియోజకవర్గంలో వైరస్ కలకలం రేపింది. అంతు చిక్కని వైరస్ తొ వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్ల ఫారం యజమానులు లక్షల్లో నష్ట పోతున్నారు.వైరస్ సోకడం వలన చికెన్ అమ్ముడు పోకపోవడంతో ధరలు తగ్గిపోయి చికెన్ దుకాణాలు నిర్వహించే యజమానులు సైతం నష్ట పోతున్నారు. వేల సంఖ్యలో కోళ్లు మరణించడం వలన కోళ్ల ఫారం యజమానులు నెత్తిన చేతులు పెట్టుకుని దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దాదాపు 2500 కోళ్లు చని పోయినట్లు యజమాని లింగం తెలిపారు. వాటిని గ్రామం నుండి దాదాపు 5 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి పెద్ద గుంతలో పూడ్చిపెట్టారు. సుమారుగా రూ.4.5 లక్షలు నష్టం వాటిల్లిందని తెలిపారు. బర్డ్ ఫ్లూ మహమ్మారి బారినపడి కోళ్లు మరణించడంతో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కోళ్ల ఫారమ్ లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.ప్రభుత్వం ఆదుకోవాలని కోళ్ల ఫారం యజమానులు కోరుతున్నారు.