Dr Arvind Yadav: బాలీవుడ్ స్టార్ సింగర్ లతామంగేష్కర్ డేట్స్ దొరకని సమయంలో బాలీవుడ్ సంగీత దర్శకులంతా గాయని హేమలత వైపు చూసేవారు. ఆమెతోనే ఆ పాటలను పాడించుకునేవారు. అందుకే ఆమెను ‘బేబీ లత’ అని ముద్దుగా పిలుచుకునే వారు. 13 సంవత్సరాల వయసులోనే గాయనిగా మెప్పించారు హేమలత. 38 భాషల్లో ఐదు వేలకు పైగా పాటలు పాడారు ఆమె. గాయని హేమలత బయోగ్రఫీని సీనియర్ పాత్రికేయుడు, రచయిత డాక్టర్ అరవింద్ యాదవ్ పుస్తకంగా తీసుకొచ్చారు. ‘దస్తాన్ ఎ హేమలత’ అనే ఈ పుస్తకం ఆవిష్కరణ ఇటీవల దిల్లీలోని సాహితీ ఆజ్ తజ్ వేదికపై జరిగింది. ఈ కార్యక్రమంలో హేమలత కూడా పాల్గొని… తొమ్మిదినెలల గర్బవతిగా ఉండగా తాను ‘నదియా కే పార్’ సినిమా కోసం పాడిన పాటను వినిపించారు. 1970, 80 లలో హిందీలోకి అనువాదమైన దక్షిణాది చిత్రాలకు ఆమె పాటలు పాడేవారు. ఆమె వ్యక్తిగత జీవితంలోని ఎన్నో విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు అరవింద్ యాదవ్ తెలిపారు.
