Bihar: బీహార్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను పదవి నుంచి తప్పించేందుకు బీజేపీ పావులు కదుపుతోందని ఆర్జేడీ ఆరోపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన నాయకులు ఈ ఆరోపణలు చేస్తున్నారు.
ఈ రాజీనామా అనేక రాజకీయ ఊహాగానాలకు తావిచ్చింది. ఆర్జేడీ చీఫ్ విప్ అక్తారుల్ ఇస్లాం షాహిన్ మాట్లాడుతూ – అసెంబ్లీ ఎన్నికలకే ముందే నితీశ్‌ను సీఎం పదవి నుంచి తొలగించే యత్నంలో భాగంగా ధన్‌ఖడ్‌ను రాజీనామా చేయించారని ఆరోపించారు. ఎన్డీయేకు ఈసారి ఓటమి తప్పదన్న ఆందోళన బీజేపీలో చెలరేగిందని, అందుకే ముందస్తు చర్యలు తీసుకుంటోందన్నారు. గతంలో ఒక సీనియర్ బీజేపీ నేత కూడా నితీశ్‌ను తప్పించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని గుర్తుచేశారు.
ఇక కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే, నితీశ్ కుమార్‌కు ఉపప్రధాని పదవి ఇవ్వాలని సూచించారని వెల్లడించారు. దీని వెనుక ఆశయం ఒక్కటే… ఆయన్ను బీహార్ రాజకీయాలనుండి దూరం చేయడమేనని విమర్శించారు. బీజేపీ ప్రణాళిక ప్రకారం, నితీశ్‌కు ఉత్సాహం లేని ఉప రాష్ట్రపతి లాంటి పదవి ఇచ్చి రాష్ట్ర పాలన నుంచి బయటకు నెట్టాలని చూస్తోందని విమర్శలు గుప్పించారు.
ఈ ఆరోపణలను ఎన్డీయే నేతలు ఖండిస్తున్నారు. బీహార్ రాష్ట్ర మంత్రి శ్రవణ్ కుమార్ స్పందిస్తూ – నితీశ్ కుమార్ ఎక్కడికీ వెళ్లబోవడం లేదని, ప్రజాసేవలో ముందుండే నాయకుడిగా బీహార్‌కి అంకితభావంతో పనిచేస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల తర్వాత కూడా నితీశ్‌నే ముఖ్యమంత్రిగా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు.
