Bihar News: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ ఆధిక్యతను సాధించి అధికార పీఠం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నది. గతంలో కూడా ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్నది. ఆ కూటమిలోని జేడీయూకు చెందిన నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈసారి ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అధ్యక్షతనే ఎన్డీయే కూటమి ఎన్నికలకు వెళ్లింది.
Bihar News: ఎన్డీయే కూటమిలో రెండు ప్రధాన పార్టీలలో జేడీయూ కంటే బీజేపీకి 4 స్థానాలను అధికంగా వచ్చాయి. ఇక్కడే మెలిక పడింది. ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ ఆశలు పెట్టుకోవడంతో అసలు ఎవరు ముఖ్యమంత్రి అనే సంశయం నెలకొన్నది. తీవ్ర ఉత్కంఠకు దారితీసిన మరో అంశం కూడా నెలకొన్నది. జేడీయూ సోషల్ మీడియా ఖాతాల్లో బీహార్‌కు మరోసారి ముఖ్యమంత్రిగా అధిష్టించనున్న నితీశ్‌కుమార్ అంటూ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీ ప్రచారం చేసుకుంటూ వచ్చింది.
Bihar News: ఉన్నఫలంగా ఆ పార్టీ ఖాతాల నుంచి ఆయా పోస్టులను జేడీయూ పార్టీ తొలగించడంతో మరిన్ని అనుమానాలు చోటుచేసుకన్నాయి. ముఖ్యమంత్రి మారుతారా? నితీశ్‌కు అవకాశం ఉండదా? బీజేపీ చేతిలోకి వెళ్తుందా? అన్న సంశయం దేశవ్యాప్తంగా నెలకొన్నది. బీజేపీ అధిష్టానం చొరవతోనే జేడీయూ తన పోస్టులను తొలగించిందన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి.
Bihar News: ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను ఎన్డీయే 202 స్థానాల్లో జయభేరి మోగించింది. వీటిలో బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీ 19, హెచ్ఏఎంఎస్ 5, ఎన్డీయేలోని ఇతర పార్టీలు 4 స్థానాలు గెలుపొందాయి. మహాఘట్ బంధన్ కూటమి 35 స్థానాల్లో గెలుపొందింది. దానిలో భాగంగా ఆర్జేడీ 25, కాంగ్రెస్ 6, సీపీఐ (ఎంఎల్) 2, ఎంజీబీ ఇతరులు కలిసి 2 స్థానాల్లో గెలిచారు. ఎంఐఎం 5, ఇతర అభ్యర్థి 1 స్థానం పొందారు.
Bihar News: పార్టీల బలాబలాలను బట్టి బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. దీంతో బీజేపీ ఆశలు పెంచుకున్నది. వ్యూహాత్మకంగా మహారాష్ట్ర ఫార్ములాను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ దశలో నితీశ్‌కుమార్ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపి నేత సామ్రాట్ చౌదరిని ముందుకు తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే బీజేపీ ఒక అంగీకారానికి వచ్చిందని గుసగుసలు. అయితే నితీశ్‌కుమార్‌ను ఒప్పించే పనిలో పడ్డట్టు తెలుస్తున్నది.
Bihar News: అసామాన్యుడు, అనితర సాధ్యుడు అయిన నితీశ్‌కుమార్ బీజేపీకి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగిస్తారా? అన్నది అనుమానంగా ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. మరో ప్రత్యామ్నాయం లేనందున ఒప్పుకొని తీరాల్సిందేనని బీజేపీ భావిస్తున్నది. తన వ్యూహాన్ని అమలు చేసేందుకు పాచికలు పన్నుతున్నట్టు తెలుస్తున్నది.
Bihar News: నితీశ్‌కుమార్ ఆర్జేడీతో కలిసే ప్రసక్తే లేదు కనుక, కలిసినా సరిపోను మెజార్టీ లేనందున చక్రబంధంలో ఇరుక్కున్నట్టేనని, బీజేపీ తను అనుకున్నట్టుగా ముఖ్యమంత్రి పీఠాన్ని కొట్టేస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్ ఈ ఒక్కసారి ముఖ్యమంత్రి పీఠం ఇవ్వండి. తర్వాత రాజకీయాలను వదిలేస్తానని బీజేపీని ఒప్పించే అవకాశమూ లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి బీహార్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో గంటల్లోనే తేలే అవకాశం ఉన్నది.

