Bihar Assembly Election Results: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను రెండు విడతల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVMలు) లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని సన్నాహాలు పూర్తి చేయగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని జిల్లాల్లోనూ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
బీహార్ ఎన్నికల్లో ఈసారి చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో 67.13% ఓటింగ్ నమోదైంది. 1951 తర్వాత ఇదే అత్యధిక పోలింగ్ శాతం కావడం విశేషం. నవంబర్ 6న మొదటి దశలో 121 స్థానాలకు, నవంబర్ 11న రెండవ దశలో 122 స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఇది కూడా చదవండి: TGTET: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల
ఈ ఎన్నికల్లో అత్యధికంగా 71.6 శాతం మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రికార్డు స్థాయి ఓటింగ్‌కు లభించే తీర్పు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 243 సీట్లలో 122 సీట్ల మ్యాజిక్ ఫిగర్ అవసరం.
ముఖ్యమంత్రి పీఠం ఎవరిది? అంచనాలు ఏంటి?
బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా ఎన్డీఏ (NDA) కూటమి విజయం సాధిస్తుందని ప్రకటించాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మహిళలు, వెనుకబడిన తరగతులు (OBCలు), అత్యంత వెనుకబడిన తరగతులు (EBCలు) నుంచి ఎన్డీఏకు బలమైన మద్దతు లభించింది.
ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన కూటమే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, యువ నాయకుడు తేజస్వి యాదవ్ ఏకంగా నవంబర్ 18న తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించి సవాల్ విసిరారు.
నితీష్ కుమార్ అధికారాన్ని నిలుపుకుంటారా? లేక తేజస్వి యాదవ్ బీహార్ రాజకీయ భవిష్యత్తుకు కొత్త కథ రాస్తారా? అన్నది నేటి ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. బీహార్ ఓటర్లు ఇచ్చిన రికార్డు తీర్పు ఫలితంపై దేశం యావత్తూ ఎదురుచూస్తోంది.

