Bigg Boss Telugu 9 Winner: తెలుగు రియాలిటీ షో చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. గత వారం రోజులుగా యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా సామాన్యుడు (కామనర్) కళ్యాణ్ పడాల నిలిచి చరిత్ర సృష్టించాడు. సెలిబ్రిటీలే రాజ్యమేలే ఈ వేదికపై, ఒక సామాన్య మధ్యతరగతి యువకుడు విజేతగా నిలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అగ్నిపరీక్ష నుంచి అగ్రస్థానం వరకు..
ఏపీలోని విజయనగరానికి చెందిన కళ్యాణ్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. దేశంపై మక్కువతో ఆర్మీలో చేరి మూడేళ్లు దేశసేవ చేసిన కళ్యాణ్, నటనపై ఉన్న మక్కువతో బిగ్ బాస్ గడప తొక్కాడు. వేలాది మందిని కాదని ‘కామనర్’ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన ఇతని ప్రయాణం పూల బాట ఏమీ కాదు.
ఇది కూడా చదవండి: Gade innaiah: చంచల్గూడా జైలుకు గాద ఇన్నయ్య.. 14 రోజుల రిమాండ్
మొదటి మూడు వారాలు ఆటలో వెనుకబడి ప్రేక్షకులను కాస్త అసహనానికి గురిచేశాడు. నాలుగో వారం నుంచి తన వ్యూహాన్ని మార్చి, ప్రతి టాస్క్ లోనూ చిచ్చరపిడుగులా దూసుకుపోయాడు. మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్ గా ఉన్న తనూజకు గట్టి పోటీనిస్తూ, తన జెన్యూన్ గేమ్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.
కళ్యాణ్ పడాల అందుకున్న మొత్తం బహుమతి ఎంత?
బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన కళ్యాణ్ కు కేవలం ట్రోఫీ మాత్రమే కాదు, భారీగానే నగదు బహుమతి కూడా దక్కింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
| అంశం | వివరాలు |
| ఒరిజినల్ ప్రైజ్ మనీ | రూ. 50 లక్షలు |
| తగ్గిన నగదు | డీమాన్ పవన్ రూ. 15 లక్షలతో క్విట్ అవ్వడంతో మిగిలింది రూ. 35 లక్షలు |
| రెమ్యునరేషన్ | వారానికి రూ. 2 లక్షల చొప్పున 15 వారాలకు రూ. 30 లక్షలు |
| కారు | మారుతీ సుజూకీ బ్రెజా (Maruti Suzuki) |
ప్రైజ్ మనీ మరియు రెమ్యునరేషన్ కలిపి కళ్యాణ్ పడాల సుమారు రూ. 65 లక్షల వరకు అందుకున్నట్లు సమాచారం. దీనికి తోడు బహుమతిగా వచ్చిన కారు అదనం.
ఒక సైనికుడిగా సరిహద్దుల్లో పోరాడిన కళ్యాణ్, బిగ్ బాస్ హౌస్ లో తన మాటలతో, నిజాయితీతో కూడిన ఆటతో ‘విన్నర్’ అనిపించుకున్నాడు. “కష్టపడితే సామాన్యుడు కూడా శిఖరాన్ని చేరుకోగలడు” అని కళ్యాణ్ నిరూపించాడు. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విజేతగా నిలిచిన కళ్యాణ్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
